ఇసుక రవాణాతో ఇబ్బందులుంటే చెప్పండి !
అచ్చంపేట: మండలంలోని చింతపల్లి సరిహద్దులో గల కృష్ణా నది నుంచి ఇసుక రవాణా చేసేందుకు ఏమైనా అభ్యంతరాలుంటే చెప్పాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గనోరి సూరజ్ ధనుంజయ్ గ్రామస్తులను కోరారు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మండలంలోని చింతపల్లిలో బుధవారం జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ సభకు జాయింట్ కలెక్టరుతోపాటు సత్తెనపల్లి ఆర్డీవో రమాకాంత్‌రెడ్డి హాజరయ్యారు. స్థానికంగా ఉన్న కార్మికులకు రీచ్‌లో పని కల్పించాలని, లోడ్ లారీలు వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు పంటలపై దుమ్ము పడకుండా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ట్రాక్టర్ల ద్వారా ఇసుకను ఉచితంగా తోలుకునేందుకు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా చూడాలన్నారు. చింతపల్లిలోని సర్వే నం.186లో 10 హెక్టార్ల విస్తీర్ణ పరిధిలో ఉన్న ఇసుకను మాత్రమే రవాణా చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించినట్లు జాయింట్ కలెక్టర్ చెప్పారు. అనంతరం ఆయన రీచ్‌ని పరిశీలించారు. ఆయన వెంట సత్తెనపల్లి ఆర్డీవో రమాకాంత్‌రెడ్డి, ఇన్‌చార్జ్ తహసీల్దారు నాగరాజు, డెప్యూటీ తహసీల్దారు జానీ బాషా పాల్గొన్నారు.
అమరావతిలో..
మండల పరిధిలోని దిడుగులో బుధవారం ఇసుక తరలింపుపై జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గగోరే సమక్షంలో గ్రామస్తులతో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు నిర్వహించారు. రీచ్ నుంచి భారీ వాహనాలు గ్రామం నుంచి వెళ్లడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో పలు ప్రమాదాలు జరిగాయని, కాలుష్యం అధికంగా ఉండేదన్నారు.అందువల్ల వ్యతిరేకిస్తున్నామని గ్రామస్తులు తెలిపారు. సత్తెనపల్లి ఆర్డీవో రమాకాంత్‌రెడ్డి, మైనింగ్ ఏడీ నాగిని, తహసీల్దార్ డానియేల్, రెవెన్యూ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.


