రెండు కార్లు ఢీకొని ఇద్దరు మహిళలు దుర్మరణం
● 16/ఏ జాతీయ రహదారి రక్తసిక్తం
●ముగ్గురికి తీవ్ర గాయాలు
చిలకలూరిపేట టౌన్: జాతీయ రహదారి 16/ఏ (చీరాల–పిడుగురాళ్ల) రక్తమోడింది. బుధవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు దుర్మరణం చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. శుభకార్యానికి వెళ్లి వస్తున్న వైద్య దంపతులు, అశుభకార్యానికి వెళ్లి వస్తున్న మరో ఐదుగురు ప్రయాణిస్తున్న కార్లు ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. రూరల్ పోలీసులు అందించిన వివరాల ప్రకారం...హైదరాబాద్ లోని ఆదిత్య సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ ఆదిత్య దంపతులు ఓ శుభకార్యానికి హాజరై కారు లో చీరాల వైపు వేగంగా వస్తున్నారు. అదే సమయంలో వింజనంపాడులో దశదిన కార్యక్రమానికి హాజరైన ఐదుగురు (ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు) చిలకలూరిపేట వైపు కారులో బయలుదేరారు. సరిగ్గా పసుమర్రు పరిధిలోని హైవే క్రాసింగ్ పాయింట్ వద్ద ఘోరం జరిగింది. వింజనంపాడు వైపు నుంచి వచ్చిన కారు స్పీడ్ బ్రేకర్ వద్ద వేగం తగ్గించి రహదారి దాటుతుండగా, చీరాల నుంచి అతి వేగంగా దూసుకు వచ్చిన కారు దాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి రెండు కార్లు నుజ్జునుజ్జయ్యాయి. సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. క్షతగాత్రుల హాహాకారాలతో భీతావహ వాతావరణం నెలకొంది. చుట్టుపక్కల ప్రజలు పరుగున వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో వైద్య దంపతులకు స్వల్ప గాయాలవ్వగా, రెండో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
స్థానికుల సమాచారంతో 108 వాహన సిబ్బంది హుటాహుటిన క్షతగాత్రులను చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అన్నంభోట్లవారిపాలెం గ్రామానికి చెందిన చెరుకూరి విజయలక్ష్మి(56), ఈవూరిపాలెం గ్రామానికి చెందిన కనపర్తి వరలక్ష్మి(70) మృతి చెందారు. కారు నడుపుతున్న సాదినేని సుధీర్‌బాబు, వజ్జా సాహిత్య, నూతలపాటి సుబ్బారావు ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. కారులో బెలూన్లు ఓపెన్ అవ్వడం వల్లే తీవ్ర గాయాలతో బయటపడ్డారని స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న రూరల్ ఎస్‌ఐ జి. అనిల్‌కుమార్ సిబ్బందితో కలిసి ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు విచారణలో తేలాల్సి ఉంది.
రెండు కార్లు ఢీకొని ఇద్దరు మహిళలు దుర్మరణం
రెండు కార్లు ఢీకొని ఇద్దరు మహిళలు దుర్మరణం


