పదిలో నూరు శాతం ఉత్తీర్ణతే లక్ష్యం
నరసరావుపేట ఈస్ట్: పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ తెలిపారు. మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలను బుధవారం ఆమె సందర్శించారు. పదవ తరగతి విద్యార్థుల సామర్థ్యాలు, నోటు పుస్తకాలు, ఎఫ్‌ఏ టూ జవాబులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులను గ్రేడ్‌లుగా విభజించి పబ్లిక్ పరీక్షలకు సిద్ధం చేయాలని సూచించారు. చదువులో వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, వారి కోసం ప్రత్యేక స్టడీ మెటీరియల్ పంపుతామని తెలిపారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు. పరీక్షలపై పలు సూచనలు, సలహాలు అందించి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం.రవికాంత్ పాల్గొన్నారు.


