జెడ్పీ సమావేశానికి తుపాను ఎఫెక్ట్
హాజరైన ఒకే ఒక్క ఎమ్మెల్యే, ఐదుగురు జెడ్పీటీసీలు కోరం లేకపోవడంతో వాయిదా వేసిన చైర్‌పర్సన్ త్వరలో నిర్వహిస్తామన్న చైర్‌పర్సన్ హెనీ క్రిస్టీనా
గుంటూరు ఎడ్యుకేషన్: జెడ్పీ సర్వసభ్య సమావేశానికి తుపాను తాకిడి ఎదురైంది. మూడు నెలలకోసారి జరగాల్సిన సమావేశం మోంథా ప్రభావంతో వాయిదా పడింది. ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం బుధవారం ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ సమావేశం జరగాల్సి ఉంది. ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభం కావాల్సి ఉండగా, జెడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినాతోపాటు సీఈవో వి.జ్యోతిబసు హాజరయ్యారు. అదే విధంగా తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ ఒక్కరే వచ్చారు. ఐదుగురు జెడ్పీటీసీ సభ్యులు పిల్లి ఓబుల్‌రెడ్డి, రమావత్ భీమీబాయ్, కల్లూరి అన్నపూర్ణమ్మ, పిల్లా ఉమాప్రణతి, గుండాల స్వీమోన్, పలువురు ఎంపీపీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఉదయం 11.30 సమయానికి సైతం ప్రజా ప్రతినిధులతోపాటు జెడ్పీటీసీ సభ్యులు హాజరు కాలేదు. కోరం లేకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు హెనీ క్రిస్టినా ప్రకటించారు. తుపాను అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో ప్రజా ప్రతినిధులు, సభ్యులు హాజరు కాలేకపోయారని, త్వరలోనే సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.
చర్చించాల్సిన ప్రజా సమస్యలెన్నో
ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా నెలకొన్న ప్రజా సమస్యలపై జెడ్పీ సర్వసభ్య సమావేశం వేదికగా చర్చించాల్సిన అవసరం ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ సభ్యుడు పిల్లి ఓబుల్‌రెడ్డి అన్నారు. బుధవారం జెడ్పీ సర్వసభ్య సమావేశం కోరం లేక వాయిదా పడిన అనంతరం వైఎస్సార్‌సీపీ సభ్యులు జెడ్పీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రొంపిచర్ల జెడ్పీటీసీ సభ్యుడు పిల్లి ఓబుల్‌రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో ముందుచూపుతో ప్రారంభించిన 17 మెడికల్ కళాశాలల నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం అడ్డుకోవడం దారుణమన్నారు. నాడు–నేడు ద్వారా పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్లు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పని చేయడం లేదన్నారు. ఉమ్మడి జిల్లాలో ఇంటికొకరు చొప్పున అనారోగ్యం బారిన పడి బాధపడుతున్నారని ఆరోపించారు. మండలాల్లోని పీహెచ్‌సీలు రోగులతో కిక్కిరిసిపోతున్నాయని అన్నారు. ఆయా అంశాలపై జెడ్పీ సమావేశంలో చర్చించాల్సిన బాధ్యత తమపై ఉందని గుర్తుచేశారు. ప్రజల సమస్యలు పట్టించుకోని ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై ప్రశ్నించాల్సి ఉందన్నారు. తుపాను ప్రభావంతో వాయిదా పడిన సమావేశాన్ని వీలైనంత త్వరలో మళ్లీ నిర్వహించాలని చైర్‌పర్సన్‌ను కోరామని చెప్పారు.
జెడ్పీ సమావేశానికి తుపాను ఎఫెక్ట్


