రోడ్డుపై విరిగి పడ్డ బండరాయి
విజయపురి సౌత్: స్థానిక ఫిషరీస్ ఆఫీస్ సమీపంలో ఘాట్ రోడ్డుపై వర్షం కారణంగా కొండ చరియ విరిగి భారీ బండరాయి పడింది. దీంతో వీఆర్వో రవికుమార్ విజయపురిసౌత్ ఎస్‌ఐ అశోక్‌కు సమాచారం అందించారు. వెంటనే ఆయన క్రేన్ సాయంతో బండరాయిని తొలగించారు.
జిల్లా ప్రజలు
అప్రమత్తంగా ఉండాలి
కలెక్టర్ కృతికా శుక్లా
నరసరావుపేట: తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలతో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. సహాయక చర్యలపై అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. బుధవారం ఆమె జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. చిలకలూరిపేట మండల కావూరు–లింగంగుంట్ల బ్రిడ్జి వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వరద నీటిని, పరిశీలించారు. నరసరావుపేట పట్టణంలోని సత్తెనపల్లి రోడ్డు స్టేడియం వద్దనున్న కత్తవ వాగు చప్టాపై ప్రవాహాన్ని పరిశీలించారు. తీసుకోవాల్సిన చర్యలపై తహసీల్దార్ వేణుగోపాలరావు, కమిషనర్ ఎం.జస్వంతరావుకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు పని ఉంటేనే బయటకు రావాలని సూచించారు.
కృష్ణా నదిలో
చిక్కుకున్న జాలరి
బెల్లంకొండ: మండలంలోని పులిచింతల ముంపు గ్రామం చిట్ట్యాల సమీపంలో కృష్ణా నదిలో చేపల వేటకు వెళ్లి ఓ జాలరి చిక్కుకున్నాడు. తెలంగాణ సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువుకు చెందిన పరసగాని శ్రీను బుధవారం ఉదయం చేపల వేటకు వెళ్లాడు. తుపాను కారణంగా కృష్ణా నదిలో చిక్కుకున్నాడు. సమాచారాన్ని ఫోన్ ద్వారా ఒడ్డునున్న వారికి తెలియజేయడంతో రక్షించేందుకు ప్రయత్నించారు. వారికి సాధ్యం కాకపోవడంతో పోలీసులకు తెలియజేశారు. వెంటనే స్థానిక ఎస్‌ఐ ప్రవీణ్, తహసీల్దారు ప్రవీణ్‌కుమార్‌లు సిబ్బందితో కలిసి కృష్ణానది వద్దకు చేరుకున్నారు. ఈత గాళ్ల సహాయంతో నదిలో చిక్కుకున్న శ్రీనును ఒడ్డుకు చేర్చారు.
నేటి నుంచి
యథావిధిగా పాఠశాలలు
డీఈఓ చంద్రకళ
నరసరావుపేట ఈస్ట్: పల్నాడు జిల్లా పరిధిలోని అన్ని యాజమాన్యాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలలు గురువారం నుంచి యథావిధిగా పని చేస్తాయని జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ తెలిపారు. మోంథా తుపాను తీవ్రత కారణంగా ఈనెల 27 నుంచి 29వ తేదీ వరకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. తుపాను ప్రభావం తగ్గడంతో గురువారం నుంచి పాఠశాలలను తెరవాలని ఆదేశించారు. పాఠశాలల్లో నీరు నిలబడటం, తరగతి గదులు మరమ్మతులకు గురవటం, నీటి సరఫరాలో అంతరాయం తదితర సమస్యలను గుర్తించి పరిష్కరించాలని ఆమె తెలిపారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇబ్బందులు తలెత్తితే వెంటనే ఎంఈఓ, డెప్యూటీ డీఈఓ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని డీఈఓ తెలిపారు.
రోడ్డుపై విరిగి పడ్డ బండరాయి


