కలాలకు కళ్లెంపై నిరసన గళం | - | Sakshi
Sakshi News home page

కలాలకు కళ్లెంపై నిరసన గళం

Oct 18 2025 6:49 AM | Updated on Oct 18 2025 6:49 AM

కలాలకు కళ్లెంపై నిరసన గళం

కలాలకు కళ్లెంపై నిరసన గళం

సాక్షి ఎడిటర్‌ ధనంజయరెడ్డిపై ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి సాక్షి కార్యాలయాలపై పోలీస్‌ దాడులు దుర్మార్గం పత్రికా స్వేచ్ఛ అణిచివేతపై ప్రజా, జర్నలిస్ట్‌ సంఘాల మండిపాటు నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల, వినుకొండలలో నిరసనలు

నరసరావుపేట: రాష్ట్రంలో కలం పట్టుకున్న పాత్రికేయులపై కూటమి ప్రభుత్వం కత్తి వేలాడదీసి బెదిరిస్తుందని, పత్రికా స్వేచ్ఛని హరిస్తుందని జర్నలిస్టు లు, ప్రజాసంఘాల నాయకులు పేర్కొన్నారు. సాక్షి ఎడిటర్‌ ఆర్‌.ధనంజయరెడ్డి, ఇతర రిపోర్టర్లపై పెట్టిన అక్రమ కేసులు, వేధింపులకు నిరసనగా శుక్రవారం పల్నాడు జిల్లా ప్రెస్‌క్లబ్‌, నరసరావుపేట, ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టు యూనియన్‌ (ఏపీడబ్ల్యూజేయూ), యూ ట్యూబర్స్‌ అసోసియే షన్‌, ప్రజాసంఘాలు, సోషలిస్టులు, వామపక్ష నాయకులు కలెక్టరేట్‌ వరకు ప్రదర్శన నిర్వహించి కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, అక్రమ కేసులను వెంటనే ఎత్తేయాలని అంటూ నినాదాలు చేశారు. అనంతరం జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు, జాయింట్‌ కలెక్టర్‌ సూరజ్‌ గనోరేలకు అక్రమ కేసులను ఎత్తేయాలని, వేధింపులు ఆపాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. సోషల్‌ యాక్టివిస్టు, నైతిక విప్లవం పత్రిక మాజీ సంపాదకులు ఈదర గోపీచంద్‌ మాట్లాడు తూ కూటమి ప్రభుత్వ అక్రమాలపై కథనాలు రాస్తున్న సాక్షి పత్రికపై అక్రమ కేసులు పెట్టి పత్రికా స్వాతంత్య్రాన్ని ప్రమాదంలో పడేసిందన్నారు. అడ్డగోలుగా ప్రజలకు అబద్దాలు చెబుతూ ప్రభుత్వాన్ని చంద్రబాబు నడిపిస్తున్నాడన్నారు. ఎన్నో ఏళ్లుగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకుండా తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారనే కారణంతో సాక్షి ప్రతినిధులపై అక్రమ కేసులు పెట్టి వేధించటం దారుణమని ఏపీడబ్ల్యూజేయూ జిల్లా గౌరవ అధ్యక్షులు నంద్యాల జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు చేస్తున్న అవినీతి, అక్రమాలను ఏరోజుకారోజు ప్రజలకు తెలియచేస్తున్నందుకే ఆ పత్రికపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఇటువంటివి కూటమి నేతలు వెంటనే మానుకోవాలని దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం (పీడీఎం) సీనియర్‌ నాయకులు నల్లపాటి రామారావు అన్నారు. నిజం రాసే సాక్షి పత్రికపై కేసులు, సోషల్‌ మీడియా పోస్టులపై కేసులు పెట్టవద్దని సుప్రీంకోర్టు చెబుతున్నా కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధించటం దారుణమని ఎంఐఎం పట్టణ అధ్యక్షులు షేక్‌ మౌలాలి చెప్పారు. సీపీఐ సీనియర్‌ నాయకుడు ఉప్పలపాటి రంగయ్య మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. సాక్షి స్టాఫ్‌ రిపోర్టర్‌ ఆర్‌.లవకుమార్‌రెడ్డి, పల్నాడు జిల్లా ప్రెస్‌క్లబ్‌, నరసరావుపేట అధ్యక్షులు సీహెచ్‌.వి.రమణారెడ్డి, ఏపీడబ్ల్యూజేయూ జిల్లా కార్యదర్శి నాగరాజు, సాక్షి టీవీ రిపోర్టర్‌ సుంకిరెడ్డి, రిపోర్టర్లు పి.కోటిరెడ్డి, జీవీ సాంబశివారెడ్డి, ఆలీ, శివ, పచ్చవ బుజ్జి, అప్పారా వు, షాహీద్‌, బాదుగున్నల శ్రీనివాసరావు, పున్నారావులు పాల్గొన్నారు.

సత్తెనపల్లిలో...

ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రమాదంలో పడేలా పాలకుల వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ సత్తెనపల్లిలోని జర్నలిస్టులు ఐక్యంగా శుక్రవారం సత్తెనపల్లి రెవెన్యూ డివిజనల్‌ అధికారి జీవీ.రమణాకాంతరెడ్డికి వినతి పత్రం అందించారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట నినదించి మీడియాతో మాట్లాటారు. కొంతకాలంగా సాక్షి ఎడిటర్‌ ఆర్‌.ధనంజయరెడ్డి, సాక్షి జర్నలిస్టులను పోలీసులు పదేపదే విచారిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఇలాంటి చర్యలు సరికాదని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేయూ పల్నాడు జిల్లా కార్యవర్గ సభ్యుడు షేక్‌ సైదా, సాక్షి సత్తెనపల్లి ఆర్సీ ఇన్‌చార్జి విప్పర్ల శ్రీనివాసరావు, జర్నలిస్టులు మారూరి లింగారెడ్డి, షేక్‌ జిలాని, షేక్‌ బాజీ, మునగా వెంకటేశ్వరరావు, అంకాళ్ల నాగరాజు, అడబాల.నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.

గురజాలలో...

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి పత్రికా స్వేచ్ఛ లేకుండా అణగదొక్కాలనే లక్ష్యంతో ఉన్నారని సాక్షి మాచర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి ఎంఎస్‌ నాగేశ్వరరావు అన్నారు. రెవెన్యూ డివిజన్‌ కేంద్రం గురజాలలో శుక్రవారం సాక్షి ఎడిటర్‌ ధనంజయరెడ్డి, ఇతర రిపోర్టర్లపై పోలీసులు అక్రమ కేసులు బనాయించడంతోపాటు వారిని బెదిరింపులకు గురిచేయడంపై అందుకు నిరసనగా ర్యాలీ నిర్వహించారు. విలేకరులపై అక్రమ కేసులు, వారిని భయాందోళనకు గురిచేయడం వంటి వాటిని మానుకోవాలన్నారు. రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయం అధికారి కె సుజాతకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో రిపోర్టర్లు వినుకొండ అజయ్‌కుమార్‌, రామారావు, పాపారావు, వెంకటేశ్వర్లు, షేక్‌ అబ్దుల్‌ రహీం, రాజారత్నారెడ్డి, మల్లికార్జునరెడ్డి, కేతిరెడ్డి బాలకృష్ణారెడ్డి తదితరులున్నారు.

వినుకొండలో...

సాక్షి పత్రిక సంపాదకులు ఆర్‌.ధనంజయరెడ్డి, రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి విలేకరులపై నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని వినుకొండ పట్టణంలోని ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా జర్నలిస్ట్‌ల ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన తెలియజేశారు. డిప్యూటీ తహసీల్దార్‌ మురళికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా జర్నలిస్ట్‌లు పాల్గొన్నారు.

ప్రజాగొంతుకై కూటమి అక్రమాలను ప్రశ్నిస్తున్న ‘సాక్షి’పై ప్రభుత్వం కక్ష కట్టింది. సాక్షి దినపత్రిక ఎడిటర్‌ ఆర్‌.ధనంజయరెడ్డి, ఇతర సిబ్బందిని నోటీసులు, కేసుల పేరిట వేధించసాగింది. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పత్రికా స్వేచ్ఛను హరించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. కూటమి కక్ష సాధింపు చర్యలపై జర్నలిస్టులు శుక్రవారం కన్నెర్ర చేశారు. జిల్లాలోని నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల, వినుకొండలలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. పత్రికా స్వేచ్ఛను కాపాడాలంటూ నినదించారు. ప్రజల తరఫున మాట్లాడితే వేధిస్తారా అంటూ నిలదీశారు. నిరసన కార్యక్రమాల్లో పాత్రికేయులు, ప్రజాసంఘాల నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు. అనంతరం సాక్షి ఎడిటర్‌, రిపోర్టర్లపై అక్రమ కేసులు, వేధింపులు అపాలని అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. సాక్షి ఎడిటర్‌ ఆర్‌.ధనంజయరెడ్డి, పాత్రికేయులకు ఇచ్చిన నోటీసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్‌చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement