
కోనేరులో దూకి మహిళ ఆత్మహత్య
మంగళగిరి టౌన్: స్థానిక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చెందిన పెద కోనేరులోకి దూకి ఓ మహిళ ఆత్మహత్యచేసుకున్న ఘటన మంగళగిరి నగరంలో గురువారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు... మంగళగిరి నగర పరిధిలోని గండాలయ్యపేటకు చెందిన చలంచలం కామాక్షి (29) తల్లి ధనలక్ష్మితో కలసి జీవిస్తోంది. కొన్నేళ్ల కిందట అనారోగ్యంతో భర్తతో పాటు పిల్లలు కూడా చనిపోయారు. పలు ఆలయాల వద్ద భిక్షాటన చేసుకుంటూ తల్లీకూతుళ్లు జీవనం సాగిస్తున్నారు. కామాక్షి కొంతకాలంగా విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతోందని, మానసిక ఆరోగ్య పరిస్థితి కూడా సరిగా లేదని తల్లి ధనలక్ష్మి పేర్కొంది. గురువారం మధ్యాహ్నం కోనేరు వద్దకు వెళ్లి ప్రహరీ ఎక్కి కోనేటిలోకి దూకేసింది. సమీపంలో కొందరు చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న మంగళగిరి పట్టణ పోలీసులు సమీపంలోని సీసీ కెమెరా పుటేజ్‌ను పరిశీలించారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వచ్చి కామాక్షి మృతదేహాన్ని వెలికి తీశారు. సంఘటనపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంగళగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా కోనేరు చుట్టూ ఫెన్సింగ్ ఉంటే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయని స్థానికులు తెలిపారు. కోనేరుకు మూడు పక్కలా ఫెన్సింగ్ ఉందని, దక్షిణం వైపు మాత్రం లేకపోవడం వల్లే ఈ ఘటనకు కారణమని వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా దక్షిణం వైపు కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.