
శునకాల దాడిలో 15 గొర్రెలు మృతి
విలపించిన యజమాని
బల్లికురవ: మండంలోని కొప్పరపాడులో కుక్కల దాడిలో 15 గొర్రెలు మృతి చెందాయి. బుధవారం అర్ధరాత్రి గ్రామంలోని బీసీ కాలనీలోని షేక్‌వలి గొర్రెల దొడ్డిలోకి ప్రవేశించిన శునకాలు వాటిపై దాడి చేసి చంపేశాయి. సుమారు వంద గొర్రెలను మేపుతూ వలి జీవనాన్ని వెళ్లదీస్తున్నాడు. కుక్కల దాడితో 15 చనిపోగా, గాయపడిన వాటిని స్థానిక పశు వైద్యశాలకు తీసుకెళ్లి వైద్యం చేయిస్తున్నారు. కుక్కకాటుకు గురవడంతో బతకడం కష్టమేనని వివరించారు. ప్రభుత్వపరంగా ఆదుకోవటంతోపాటు గ్రామంలో కుక్కలకు అడ్డుకట్ట వేయాలన్నారు. స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు బుర్రి ఆదినారాయణ, మూడావత్ దానానాయక్‌లు చనిపోయిన గొర్రెలను పరిశీలించారు. కుక్కలు ఏడాదిగా పలువుర్ని కరిచాయని ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదన్నారు. తాను రూ.2 లక్షల వరకు నష్టపోయానని వలి తెలిపారు.