
సీజేఐపై దాడికి ఎమ్మార్పీఎస్ నిరసన
నరసరావుపేట: సుప్రీంకోర్టు న్యాయమూర్తి బీఆర్ గవాయిపై జరిగిన దాడిని ఖండిస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్), ఎంఎస్‌పీ, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు నల్లజెండాలతో సోమవారం కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. ప్రదర్శనగా వచ్చిన ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు ప్రవేశద్వారం ముందే నిలిపివేశారు. దీంతో వారందరూ అక్కడే బైఠాయించి ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేవలం పదిమందిని మాత్రమే లోపలికి అనుమతిస్తామని పోలీసులు చెప్పగా వారు నిరాకరించారు. తామంతా ప్రశాంతంగా కలెక్టర్ కార్యాలయంవరకు వెళ్లి వినతిపత్రం అందజేస్తామని కోరారు. దీనిపై రూరల్ ఎస్‌ఐ కిషోర్, పట్టణ ఎస్‌ఐ ఫాతిమాలు పై అధికారుల అనుమతితో వారందరినీ లోపలికి అనుమతించారు. నినాదాలు చేస్తూ కలెక్టర్ కార్యాలయం వరకు వెళ్లి అధికారులకు వినతిపత్రం సమర్పించారు. దుడ్డు రామకృష్ణ మాదిగ, చిరుగూరి జక్రం, కనుమూరి కోటేశ్వరరావు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.