
అర్జీల సత్వర పరిష్కారమే లక్ష్యం
పీజీఆర్‌ఎస్‌లో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా
నరసరావుపేట: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో అందిన అర్జీల సత్వర పరిష్కారమే లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ ద్వారా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి 152 అర్జీలను జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, జిల్లా అధికారులతో కలిసి స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో ఎటువంటి జాప్యానికి తావులేకుండా నాణ్యతతో పరిష్కరించాలన్నారు. అర్జీదారుని సంతృప్తి, రీఓపెన్ కాకుండా అర్జీల పరిష్కారతీరు ఉండాలని స్పష్టం చేశారు. అధికారులు వారి శాఖలకు సంబంధించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి తమ సిబ్బందితో నిర్ణీత గడువులోగా త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యలు తమ పరిధిలోనివి కానప్పుడు వెంటనే సంబంధిత శాఖకు పరిష్కారం కోసం పంపాలని కలెక్టరు సూచించారు.