
మూడేళ్ల నాటి కేసులో వేధింపులు
నరసరావుపేట రూరల్: అక్రమ కేసులతో విద్యార్థినులను క్రోసూరు పోలీసులు వేధిస్తున్నారని ఓ మహిళ జిల్లా ఎస్పీ బి.కృష్ణారావుకు ఫిర్యాదు చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. కుటుంబ, ఆస్తి, ఆర్థిక తగాదాలు, మోసాలు తదితర సమస్యలపై 117 ఫిర్యాదులు అందాయి. ప్రజాసమస్యల పరిష్కార వేదికలో వచ్చే ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ తెలిపారు.
కలెక్టర్ ఆదేశాలను పట్టించుకోవడం లేదు
క్రోసూరు ఎస్సీ కాంప్లెక్స్‌లో దుకాణాన్ని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకుని బాధితురాలికి న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను స్థానిక పోలీసులు పాటించడం లేదని క్రోసూరుకు చెందిన సీహెచ్ హానీ గ్లాడెన్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే మూడుసార్లు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసినా కలెక్టర్ ఆదేశాలను ఎస్‌ఐ అమలు చేయడం లేదన్నారు. దుకాణంపై వచ్చే ఆదాయమే తనకు జీవనాధారమని తెలిపారు. టీడీపీ నాయకుల అండతోనే తన దుకాణాన్ని ఆక్రమించుకుంటున్నట్టు బాధితురాలు తెలిపారు.
అప్పు తీరినా తనఖా కాగితాలు ఇవ్వడం లేదు
అప్పు మొత్తం చెల్లించినా ఇంటి తనఖా కాగితాలు ఇవ్వడం లేదని వినుకొండకు చెందిన కంచర్ల కోటేశ్వరమ్మ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. లారీని కొనుగోలు చేసేందుకు ఎండ్లూరి అరుణ వద్ద రూ.5.75లక్షలు అప్పుగా తీసుకుని ఇంటిని తనఖా పెట్టామని తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో అప్పు మొత్తం చెల్లించి తనఖా రిజిస్ట్రేషన్ రద్దు చేసుకొని ఒరిజనల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఇవ్వమని అడగ్గా ఇవ్వకుండా వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
నగదు ఇవ్వకుండా వేధింపులు..
మంజూరైన ముద్ర రుణం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని రెంటచింతలకు చెందిన ఎర్రపాటి లక్ష్మీరాజ్యం ఫిర్యాదు చేసారు. తుమ్రకోట యూనియన్ బ్యాంక్‌లో తనకు రూ.5.60లక్షలు ముద్ర లోన్ మంజూరైందని, ఈ నగదును బి.శ్యామ్‌రాజు అనే వ్యక్తి కంపెనీ అకౌంట్‌లో పడినట్టు పేర్కొన్నారు. ఇందులో రూ.3లక్షలు ఇచ్చి మిగిలిన నగదు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. నగదు ఇప్పించి న్యాయం చేయాలని కోరారు.
ఆన్‌లైన్‌లో మహిళ మోసం చేసింది..
రైస్ బిజినెస్‌లో పెట్టుబడి పెడితో మూడు నెలల్లో డబుల్ వస్తుందని ఆన్‌లైన్ మహిళ చెప్పిన మాటలు నమ్మి మోసపోయినట్టు శావల్యాపురం మండలం మతుకుమల్లికి చెందిన ఎర్రగుంట సంపంగిరావు ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. ఆన్‌లైన్ మార్కెట్ పరిశీలిస్తుండగా లావణ్య అనే మహిళ పరిచయమైందని, రైస్ బిజినెస్‌లో మూడు నెలల్లో పెట్టుబడికి డబుల్ వస్తుందని చెబితే రూ.7లక్షలు తన అకౌంట్‌కు చెల్లించినట్టు తెలిపాడు. రెండు నెలలు ఫోన్ కాంటాక్ట్‌లో ఉన్న మహిళ తరువాత ఫోన్ స్విఛాఫ్ చేసిందని, తనకు న్యాయం చేయాలని కోరాడు.