
వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకించాలి
వైఎస్సార్‌సీపీ విద్యార్థి, యువజన విభాగ నాయకులు 19న పిడుగురాళ్లలో ‘చలో మెడికల్ కళాశాల’కు పిలుపు
నరసరావుపేట: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి పేరు రాకూడదనే ఉద్దేశంతోనే ఆయన ప్రారంభించిన మెడికల్ కళాశాలలను చంద్రబాబు ప్రైవేటుపరం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ విద్యార్థి, యువజన విభాగ నాయకులు ఆరోపించారు. బుధవారం సాయంత్రం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విద్యార్థి విభాగ జిల్లా అధ్యక్షుడు గుజ్జర్లపూడి ఆకాష్‌కుమార్ మాట్లాడుతూ.. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వలన సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అన్యాయం జరగనుందన్నారు. బినామీలు, వ్యాపారవేత్తలకు విద్య, వైద్యం అమ్ముకునే విధంగా చంద్రబాబు పాలన సాగుతోందన్నారు. పార్టీ అధినేత పిలుపు మేరకు ఈ నెల 19వ తేదీన ఉదయం 10 గంటలకు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చలో మెడికల్ కళాశాల కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. విద్యార్థి విభాగ అధ్యక్షులు పానుగంటి చైతన్య పాల్గొంటారన్నారు. విద్యార్థులు, యువత, పార్టీ నాయకులు, కార్యకర్తుల పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
చిత్తశుద్ధితో కళాశాలలు పూర్తి
యువజన విభాగ జిల్లా అధ్యక్షుడు కందుల శ్రీకాంత్ మాట్లాడుతూ పిడుగురాళ్లలో ఉన్న మెడికల్ కళాశాల వద్ద శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపడతామన్నారు. యువజన విభాగ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అల్లాభక్షు మాట్లాడుతూ పేదల ఆరోగ్యం కోసం కేంద్రంతో పోరాడి 17 కళాశాలలను వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ తీసుకొచ్చారన్నారు. కరోనా కష్టకాలంలో వాటికి భూమి సేకరించి, ఐదు కళాశాలలను కూడా పూర్తి చేశారన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రైవేటీకరణను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని చెప్పారు. పిడుగురాళ్లకు చెందిన నాయకుడు జలీల్ మాట్లాడుతూ.. నిరసనను అందరూ జయప్రదం చేయాలన్నారు.