
ఇవిగో నిదర్శనాలు...
జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాలు పోలీసు కేసుల వరకు వెళ్లని ఎక్కువ మోసాలు ఈ ఏడాది తొలి ఆర్నెల్లలో జిల్లాలో 967 ఫిర్యాదులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినవి ఐదే అవగాహనాలోపంతో ‘గోల్డెన్ అవర్’ వినియోగించుకోని బాధితులు అత్యాశతో మోసపోతున్న వారే అధికం
సైబర్ నేరగాళ్లు రోజుకో రూపంలో ప్రజలను బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఫోన్లకు వచ్చే సందేశాలకు కొందరు మోసపోతున్నారు. బ్యాంక్ అధికారులమంటూ వ్యక్తుల ఖాతాల్లోని నగదును మాయం చేస్తున్నారు. ఉద్యోగాలు, కానుకల ఆశ చూపి వంచిస్తున్నారు. పరువుపోతుందని కొందరు, ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక ఇంకొందరు మిన్నకుండిపోతున్నారు.
సాక్షి, నరసరావుపేట: ఆన్‌లైన్ మోసాలపై ప్రజలను పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. గ్రామాలు, కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. కానీ ఏదో ఒక రకంగా ప్రజలు మోసపోతూనే ఉన్నారు. సైబర్ నేరగాళ్లు యూపీ, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, బిహార్ ప్రాంతాలకు చెందినవారు కావడంతో కేసులు నమోదు చేసినప్పటికి వాటిని ఛేదించడం సవాల్‌గా మారుతోంది. దీంతో ప్రజల అప్రమత్తంగా ఉండటమే సైబర్ నేరాల నివారణకు మార్గమని అధికారులు చెబుతున్నారు.
ఉన్నత విద్యావంతులు సైతం...
సైబర్ నేరగాళ్లు రకరకాల మోసాలతో ప్రజలను బుట్టలో వేసుకొని డబ్బులు కొల్లగొడుతున్నారు. నిరక్షరాస్యులు మోసపోయే అస్కారం ఎక్కువగా ఉండగా... విచిత్రంగా విద్యావంతులై సాంకేతికత పరిజ్ఞానంపై అవగాహన ఉన్న వారు సైతం సైబర్ నేరగాళ్ల వలకు అడ్డంగా దొరికిపోతున్నారు. ప్రధానంగా కస్టమర్ కేర్, నకిలీ ప్రకటనలు, ఉద్యోగాలు, పెట్టుబడులు పేరుతో ఎక్కువగా ప్రైవేట్ ఉద్యోగులు, యువత మోసపోతున్నారు. పల్నాడులో ఓ వ్యాపారి ఇటీవల ఆన్‌లైన్ గేమ్ పేరిట ఏకంగా రూ.9 లక్షలకుపైగా మోసపోయి పోలీసులను ఆశ్రయించారు.
వెంటనే ఫిర్యాదు చేస్తే ఫలితం
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన బాధితులు సకాలంలో ఫిర్యాదు చేస్తే సొమ్ము రికవరీకి అవకాశం ఉంటుంది. సైబర్ నేరాలపై 1930 టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలి. ఆ ఫిర్యాదు సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు సైబర్ సెల్ నుంచి అందుతుంది, విచారణ తర్వాత పోలీసులు కేసు నమోదు చేస్తారు. సైబర్ నేరగాడి బ్యాంక్ ఖాతాలు తెలుసుకున్న పోలీసులు ఆ ఖాతాలను ఫ్రీజ్ చేసి కోర్టు ద్వారా నగదు తిరిగి రప్పించేలా చర్యలు తీసుకుంటారు. కొంతమంది మోసపోయిన వెంటనే 1930కి కాల్ చేయాలని తెలియకపోవడం, పరువుపోతుందనో ఆలస్యంగా ఫిర్యాదుచేయడం వల్ల సైబర్ నేరగాడు తస్కరించిన నగదును ఉపసంహరిస్తే ఆ తర్వాత చేసేదేమీ ఉండదు. దీంతో ప్రాథమిక దశలోనే వందల కేసులు ఆగిపోయి, ఎఫ్‌ఐఆర్ దశ వరకు రావడం లేదు. ఈ ఏడాది జనవరి నుంచి జూలై చివరి వరకు జిల్లాలో ఏకంగా 967 సైబర్ అటాక్‌లు జరగగా... ఎఫ్‌ఐఆర్ అయ్యింది 5 మాత్రమే అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కొంత మంది చిన్న మొత్తమే అనో, బయటకు చెబితే పరువు పోతుందనో ఫిర్యాదుకు వెనుకాడుతున్నారు. కొందరైతే ఏకంగా అమ్మాయిల వలపు వలలో చిక్కి భారీగా నగదు మోసపోతున్నారు. అప్రమత్తంగా ఉంటే సైబర్ నేరాల నుంచి తప్పించుకొనే అవకాశముంటుంది.
సత్తెనపల్లికి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు అచ్చంపేట మండలంలో ఎస్జీటీగా పనిచేస్తున్నారు. ఈ ఏడాది మార్చి 10న వాట్సాప్‌లో ఓ గ్రూప్ ఇన్విటేషన్ వచ్చింది. ఆ లింక్‌ను ఓపెన్ చేయగా ‘ఎఫ్ 979 2025 ఫార్‌ూచ్యన్ గ్రూప్’ ప్రత్యక్షమైంది. సభ్యుడిగా చేరిపోయారు. ఆ గ్రూప్‌లో స్టాక్‌మార్కెట్ పెట్టుబడుల గురించి సలహాలు, సూచనలు ఇచ్చారు. ఏంజల్ వన్ గార్డ్ అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోమని తెలిపారు. ఆ యాప్ ద్వారా రూ.లక్షలు సంపాదిస్తున్న వారి స్క్రీన్‌షాట్లను సైతం షేర్ చేస్తున్నారు. వాటిని నమ్మిన సదరు ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఈ ఏడాది జూలై 25వ తేదీ నుంచి తాను, ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న తన భార్య, స్నేహితుల ఖాతాల నుంచి విడతలవారీగా రూ.64,50,199 బదిలీ చేశారు. లాభాలు వస్తున్నాయని గ్రూప్‌లో మెసేజ్‌లు వస్తున్నాయేగానీ, ఆ నగదు డ్రా చేయడానికి కుదరడం లేదు. ఏంటని గ్రూప్‌లో మెసేజ్ చేయగా... లాభాలు తీసుకోవాలంటే ట్యాక్స్ కట్టాలంటూ రిప్‌లై ఇచ్చారు. దీంతో అనుమానం వచ్చి దాని గురించి ఆరా తీయగా సైబర్ నేరగాళ్లు నడుపుతున్న ఫేక్‌గ్రూప్‌గా తేలింది. బాగా చదువుకున్న ఉపాధ్యాయ కుటుంబం ఇలా అత్యాశకు పోయి సైబర్ నేరగాళ్ల బారినపడటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనిపై సత్తెనపల్లి పోలీసు స్టేషన్‌లో ఈ నెల 5వ తేదీన కేసు నమోదు చేశారు.
నరసరావుపేటకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సెల్‌ఫోన్‌కు పదిహేను రోజుల క్రితం ఓ కాల్ వచ్చింది. అందులో మీ ఆదాయ పన్ను చెల్లింపుల్లో లోపాలు ఉన్నాయని, రేపు ఉదయానికల్లా విజయవాడ కార్యాలయానికి వచ్చి సంబంధిత పత్రాలు సమర్పించాలని తెలిపారు. తాను బెంగళూరు కార్యాలయంలో ఉన్నానని, రేపటికల్లా విజయవాడ రాలేనని తెలిపారు. కాల్ చేసిన వ్యక్తి ఓ సలహా ఇచ్చాడు. మీ మొబైల్‌కు ఓ లింక్ పంపుతామని, కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే ఆన్‌లైన్‌లో సరిచేసుకోవచ్చని తెలిపి, వెంటనే లింక్ పంపాడు. దీంతో ఆ ఇంజినీర్ లింక్ ఓపెన్ చేసి, ఓటీపీ ఎంటర్ చేసి చూడగా వెంటనే తన ఖాతాలో ఉన్న రూ.3.74 లక్షలు మాయమయ్యాయి. దీంతో షాక్ తిన్న బాధితుడు బాధపడి మిన్నుకుండిపోయారు. స్నేహితుల సలహాతో వారం తర్వాత ఫిర్యాదు ఇవ్వడంతో ఆ సైబర్ నేరగాడి బ్యాంక్ ఖాతాను ఫ్రీజ్ చేయడానికి చూస్తే అప్పటికే అకౌంట్ ఖాళీ అయ్యింది. మోసపోయామని తెలిసిన వెంటనే సైబర్ సెల్‌కు ఫిర్యాదు చేసి ఉంటే నగదు వెనక్కి వచ్చే అవకాశం ఉండేది. ఇలా చాలమంది సైబర్ నేరగాళ్ల బారినపడిన తర్వత ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు.

ఇవిగో నిదర్శనాలు...

ఇవిగో నిదర్శనాలు...