
వైఎస్సార్‌సీపీ
బ్రహ్మారెడ్డి మేక తోలు కప్పుకున్న తోడేలు కూటమి ప్రభుత్వ వేధింపులతో 570కు పైగా కుటుంబాలు వలస 600 మంది వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు వైఎస్సార్‌సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
వరికపూడిసెలకు అనుమతులు తెచ్చిందే
మాచర్ల రూరల్: కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదని వైఎస్సార్‌సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. ప్రతిపక్షంపై అక్రమ కేసులు పెట్టడం, భూదందాలు, రేషన్ మాఫియా, సామాన్యులపై వేధింపులు తప్ప ప్రజా సంక్షేమం శూన్యమని పేర్కొన్నారు. అక్రమ కేసులతో అణగదొక్కే ధోరణికి తగిన సమయంలో పదింతలు సమాధానం చెప్పే రోజు వస్తుందని హెచ్చరించారు. కూటమి నాయకులు, అధికారులు ఈ విషయం గుర్తుంచుకోవాలన్నారు. బుధవారం పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బ్రహ్మారెడ్డి మొదటి నుంచి నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తి కావటం వలన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన రోజునే తనపై అక్రమ కేసులు మోపి జైలుకు పంపారన్నారు. ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా తమ కుటుంబం ఉందని, నాలుగుసార్లు వరుసగా తనను ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపించారన్నారు. కష్టసుఖాలలో చేదోడుగా ఉండేందుకు ప్రజల వద్దకు వెళ్తే అక్రమ కేసులు నమోదు చేస్తున్నారన్నారు. టీడీపీలో వర్గపోరు వలన గుండ్లపాడులో జంట హత్యలు జరిగితే అప్పటికప్పుడు స్క్రిప్ట్ తయారు చేసి పోలీసులపై ఒత్తిడి తెచ్చి తనపై అక్రమ కేసులు నమోదు చేశారన్నారు. ఈ హత్యలో తనకు సంబంధం లేదని అందరికీ తెలుసన్నారు. ప్రత్యక్షంగా హత్యారాజకీయాలు చేసే బ్రహ్మారెడ్డి సుద్దపూస మాటలు, మహాత్మా గాంధీ ప్రసంగాలు ప్రజలు నమ్మరన్నారు. ఆయన గురించి తల్లి దుర్గాంబ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన హత్యాకాండకు సంబంధించి చంద్రబాబు పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి అందరికీ తెలుసన్నారు. తనపై ఓడిపోయి 12 సంవత్సరాలు నియోజకవర్గ ప్రజలకు ముఖం చూపించే ధైర్యం లేని ఆయన ఇప్పుడు ధైర్యం, సవాలు అంటూ సుద్దపూసలు మాట్లాడే బ్రహ్మారెడ్డి మేకతోలు కప్పుకున్న తోడేలులాంటి వారని చెప్పారు. పేదలకు అందించే రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేస్తూ చెక్‌పోస్టుల ద్వారా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారని పిన్నెల్లి ఆరోపించారు. మంచికల్లు, కంభంపాడు గ్రామాల మిల్లులలో ఎమ్మెల్యే చేసే రీసైక్లింగ్ వ్యాపారం గురించి ఇక్కడ ఎవరిని అడిగినా చెబుతారన్నారు.
వైఎస్ జగన్‌తోనే ప్రాజెక్టు సాధ్యం
పల్నాటి ప్రజల చిరకాల వాంఛ వరికపూడిసెల ప్రాజెక్టు కోసం కృషి చేసిన పార్టీ తమదేనన్నారు. 1996లో అప్పటి సీఎం చంద్రబాబు ప్రాజెక్టుకు శంకుస్థాపన శిలాఫలకం వేసి మరిచిపోగా, తనయుడు లోకేష్ మళ్లీ ఆవిష్కరించారని మండిపడ్డారు. తొలుత వైఎస్సార్, అనంతరం వైఎస్ జగన్‌ల చొరవతో కదలిక వచ్చిందన్నారు. ఈ ప్రాజెక్టుకు పూర్తి అనుమతులు తీసుకొచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయించి బ్రహ్మారెడ్డి మాట్లాడాలని డిమాండ్ చేశారు. అభివృద్ధికి మొత్తం రూ.1,115.66 కోట్లు నిధులను నియోజకవర్గానికి తెచ్చామని వివరించారు. ఎమ్మెల్యేగా బ్రహ్మారెడ్డి ఎన్నికై కొన్ని నెలలే పూర్తయిందని, ఇంకా చాలా సమయం ఉందన్నారు. కచ్చితంగా అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధపడదామన్నారు.
అక్రమ కేసులతో వేధింపులు
నియోజకవర్గాన్ని ప్రశాంతంగా ఉంచుతానని, అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలకు దూరంగా ఉంటానని పైకి శాంతి కాముకుడిలా ప్రవచనాలు వల్లించే బ్రహ్మారెడ్డి అసలు స్వరూపం వేరని పిన్నెల్లి పేర్కొన్నారు. నియోజకవర్గంలో 600 మందికిపైగా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించారని తెలిపారు. ఈ పరిణామాలతో సుమారు 570కిపైగా కుటుంబాలు వలస వెళ్లినట్లు పేర్కొన్నారు. వీరందరూ దూర ప్రాంతాలలో కూలీలుగా, వాచ్‌మెన్‌లుగా పనులు చేసుకుంటున్నారని తెలిపారు. ఇటీవల ఆరుగురిపై పీడీ యాక్టు నమోదు చేయటం దుర్మార్గమైన చర్య అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వ్యక్తులపై ఈ కేసులు నమోదు చేయటంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. వీటిలో పాత్ర ఉన్న కలెక్టర్, ఎస్పీలపై కూడా భవిష్యత్తులో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.