
తెలుగు గడ్డపై 25వ భారత్ రంగ్ మహోత్సవ్
● గుంటూరు వేదికగా నాటక ప్రదర్శనలు
● భారత్ నుంచి–2, విదేశాల
నుంచి–3 నాటక ప్రదర్శనలు
● 2026 ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభం
యడ్లపాడు:అంతర్జాతీయ నాటకోత్సవం 25వ భారత్ రంగ్ మహోత్సవ్–2026 నిర్వహణకు గుంటూరులోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరం వేదిక కానుంది. ఈ బృహత్తర కార్యక్రమాన్ని భారత సాంస్కృతిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, తెలుగు నాటక పరిషత్తుల సమ్మేళనం ‘వేదిక’ సంస్థ సంయుక్తంగా చేపడుతున్నాయి. విదేశాలకు చెందిన మూడు నాటకాలు, మన దేశస్తుల రెండు నాటకాలు ఈ కార్యక్రమంలో ప్రదర్శితం కానున్నాయి. ఈ కార్యక్రమం 2026 ఫిబ్రవరి 6 నుంచి 10 వరకు కొనసాగనుంది. యడ్లపాడులోని వేదిక కార్యాలయంలో సంస్థ అధ్యక్షులు డాక్టర్ ముత్తవరపు సురేష్‌బాబు ఆధ్వర్యంలో వేదిక కార్యవర్గ సభ్యులు, రచయితలు, కళాపరిషత్ నిర్వాహకులు, కళాకారులతో కార్యాచరణపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. సురేష్‌బాబు మాట్లాడుతూ ఐదు రోజులపాటు జరిగే ఈ ఉత్సవంలో ప్రతిరోజూ ఒక జాతీయ లేదా అంతర్జాతీయ నాటక ప్రదర్శన ఉంటుందని తెలిపారు. నాటక రంగంలో విశేష కృషి చేసిన ప్రముఖులను సత్కరించాలని వేదిక సంకల్పించిందని వివరించారు. ప్రతిరోజూ మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెలుగు రాష్ట్రాల కళాకారులు ఇచ్చే విభిన్న కళారూపాల ప్రదర్శనలు ప్రేక్షకులకు ఆహ్లాదాన్ని ఆనందాన్ని అందిస్తాయని తెలిపారు. సమావేశంలో ఏఎన్‌యూ థియేటర్ ఆర్ట్స్ హెడ్ నాగభూషణం, వేదిక ప్రతినిధులు పీవీ మల్లికార్జునరావు, జీవీ మోహనరావు, యార్లగడ్డ బుచ్చయ్యచౌదరి, పోపూ రి నాగేశ్వరరావు, కట్టా శ్రీహరి, నడిమిపల్లి వెంకటేశ్వర్లు, ముత్తవరపు రామారావు, డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు, వీసీహెచ్ ప్రసాద్, పోపూరి శివరామకృష్ణయ్య, పుచ్చలపల్లి సుందరయ్య కళానిలయం(యడ్లపాడు), కొండవీటి కళాపరిషత్ (లింగా రావుపాలెం), వరగాని, మార్టూరు, అనంతవరానికి చెందిన కళా పరిషత్తుల నిర్వాహకులు పాల్గొన్నారు.