
శిల్ప సంపదను అమరావతికి చేర్చాలి
అమరావతి: దేశ, విదేశాలలో ఉన్న అమరావతి ప్రాచీన శిల్ప సంపదను అమరావతి మ్యూజియంకు రప్పించాలని కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు మంగళవారం అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు వినతిపత్రం సమర్పించారు. ఆయన ఢిల్లీ నుంచి ఫోన్‌లో మాట్లాడుతూ కేంద్ర పురావస్తు శాఖ పరిధిలోని అమరావతి సర్కిల్‌లో 15 నుంచి 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న క్యాజువల్ కార్మికులను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారని, జెమ్ ద్వారా టెండర్ పిలిచేందుకు చర్యలు తీసుకున్నారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళామన్నారు. పూర్వం శాతవాహనుల రాజధానిగా ఉన్న ధరణికోటలో ఉన్న కేంద్ర పురావస్తు శాఖకు సంబంధించిన 16 ఎకరాల్లో తవ్వకాలు జరిపితే విలువైన శిల్పాలు వెలుగుచూసే అవకాశం ఉందన్నారు. తవ్వకాలు జరిపేందుకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. యునైటెడ్ కింగ్‌డమ్ ప్రభుత్వంతో చర్చించి లండన్ మ్యూజియంలోని అమరావతి శిల్పాలను తిరిగి తెప్పించెందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం చైన్నె, ఢిల్లీ, కొల్‌కత్తా, హైదరాబాద్ మ్యూజియంలలో ఉన్న అమరావతికి సంబంధించిన శిల్పాలతోపాటు లండన్ బ్రిటిష్ మ్యూజియంలో అమరావతి గ్యాలరీ నెంబర్ 33ఏలో ఉన్న సుమారు 133 అద్భుతమైన అతి ప్రాచీనమైన కళాఖండాలను అమరావతికి తరలించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరినట్లు తెలిపారు.
కేంద్ర మంత్రి షెకావత్‌కు డాక్టర్ జాస్తి వినతి