
రెండేళ్ల క్రితం తప్పిపోయిన తల్లి, పిల్లల గుర్తింపు
మంగళగిరి: రెండేళ్ల క్రితం తప్పిపోయిన మహిళ, ఆమె ఇద్దరి పిల్లలను గుర్తించి పట్టుకుని, కుటుంబసభ్యులకు పోలీసులు అప్పగించారు. మంగళగిరి రూరల్ సీఐ వై.శ్రీనివాసరావు మంగళవారం తెలిపిన వివరాల మేరకు.. గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామానికి చెందిన కట్టా లక్ష్మి అనే మహిళ మంగళగిరి మండలం కురగల్లు గ్రామంలో నివసించే తన కుమార్తె తోకల తిరుపతమ్మ(23) ఆమె ఇద్దరు పిల్లలు మోక్ష శ్రీనాథ్(5), స్నేహశ్రీ(3)లు కనిపించడం లేదని 2023 ఏప్రిల్ నెలలో మంగళగిరి రూరల్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన భర్త సరిగా చూడడం లేదనే కారణంతో మనస్థాపం చెందిన తిరుపతమ్మ తన పిల్లలతో సహా ఎక్కడికో వెళ్లిపోయిందని తల్లి లక్ష్మి ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసి నార్త్ జోన్ డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో సీఐ వై.శ్రీనివాసరావు, ఎస్‌ఐ సీహెచ్ వెంకట్‌లు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టినట్లు తెలిపారు. అనేక ప్రాంతాలలో సమాచారం సేకరించి చివరకు గుంటూరు జిల్లా బుడంపాడులో వున్నట్లు గుర్తించి తిరుపతమ్మను, పిల్లలను మంగళవారం తల్లి లక్ష్మి, కుటుంబసభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. కేసును చేధించి తల్లి, పిల్లలను కనుగొన్న డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలతో పాటు బృందంలోని సిబ్బందిని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించినట్లు తెలిపారు.
కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు