
ఏబీఆర్ డిగ్రీ కళాశాల విద్యార్థి ఆత్మహత్యాయత్నం
రేపల్లె(చెరుకుపల్లి): రేపల్లె పట్టణంలోని అనగాని భగవంతరావు(ఏబీఆర్) డిగ్రీ కళాశాల విద్యార్థి సొంటి రామ్ మల్లేష్ సోమవారం కళాశాల ప్రాంగణంలోనే పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సహచర విద్యార్థులు గుర్తించి అతనిని ఆస్పత్రికి తరలించారు. అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సంఘటనకు బాధ్యుడైన గెస్ట్ ఫ్యాకల్టీ నారాయణపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు మంగళవారం ప్రిన్సిపాల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ సహాయ కార్యదర్శి వై.నవీన్ మాట్లాడుతూ విద్యార్థి సొంటి రామ్ మల్లేష్ పట్ల గెస్ట్ ఫ్యాకల్టీ నారాయణ కొంత కాలంగా కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నాడని పేర్కొన్నారు. సోమవారం తరగతులకు అనుమతించకుండా వేధింపులకు గురిచేయడంతోపాటు టీసీ ఇచ్చి ఇంటికి పంపుతానని బెదిరించాడని తెలిపారు. చదువుకు దూరం అవుతాననే భయంతో మనస్తాపం చెందిన మల్లేష్ కళాశాల ఆవరణలోనే పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని తెలిపారు. ఈ ఘటనపై అధికారులు సమగ్ర విచారణ జరిపించి, నారాయణను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి తిరిగి కళాశాలలో చదువుకునేలా అవకాశం కల్పించాలని కోరారు. సైన్స్ విభాగానికి కొత్త ఫ్యాకల్టీని నియమించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఎం.సూర్యప్రకాశరావు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.