
ప్రయాణికులకు మెరుగైన సేవలే లక్ష్యం
విమానాశ్రయం(గన్నవరం): విమాన ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పనిచేస్తోందని గన్నవరం విమానాశ్రయ డైరెక్టర్ ఎల్.లక్ష్మీకాంతరెడ్డి తెలిపారు. స్థానిక విమానాశ్రయ టెర్మినల్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 17వ తేదీన ‘యాత్రి సేవ దివస్’లో భాగంగా పౌర విమానయాన శాఖ ఆదేశాల మేరకు విమానాశ్రయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఎయిర్‌పోర్ట్ ప్రాంగణంలో మొక్కలు నాటడంతో పాటు వైద్య శిబిరం, రక్తదాన శిబిరం నిర్వహిస్తామని పేర్కొన్నారు. విమానయాన సేవలపై విద్యార్థులకు అవగాహన, యువతకు ఎయిర్‌పోర్ట్ ఉద్యోగ అవకాశాలపై కెరీర్ గైడెన్స్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి థీమ్‌పై విద్యార్థులకు, బాల ప్రయాణికులకు డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తామన్నారు.