
ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
నరసరావుపేట: ఉపాధ్యాయుల ఆర్థికేతర, ఆర్థికపరమైన దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని ఏపీ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మహమద్ ఉస్మాన్, వీ.వీ రవికుమార్ పేర్కొన్నారు. మంగళవారం తమ డిమాండ్ల సాధన కోసం కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జేసీ సూరజ్ గనోరేకు అందజేశారు. వారు మాట్లాడుతూ తమ డిమాండ్ల సాధన కోసం ఈనెల 11వ తేదీ నుంచి నిరసన దినం పాటిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు నాలుగు డీఏలు బకాయిలు ఉందని, వాటిని తక్షణమే విడుదల చేసి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఊరట కలిగించాలన్నారు. 12వ పీఆర్‌సీ కమిషన్ ఇప్పటివరకు నియమించకపోవటం తీవ్ర అసంతృప్తి కలిగిస్తుందన్నారు. తక్షణమే 30 శాతం ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యదర్శి మక్కెన శ్రీనివాసరావు మాట్లాడారు. జిల్లా ఉపాధ్యక్షులు చాళ్ల శ్రీనివాసరావు, ప్రజామూర్తి, జిల్లా కార్యదర్శి ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ ఎదుట ఏపీటీఎఫ్ నాయకుల నిరసన