జిల్లాను అగ్రగామిగా నిలుపుదాం | - | Sakshi
Sakshi News home page

జిల్లాను అగ్రగామిగా నిలుపుదాం

Sep 14 2025 3:29 AM | Updated on Sep 14 2025 3:29 AM

జిల్లాను అగ్రగామిగా నిలుపుదాం

జిల్లాను అగ్రగామిగా నిలుపుదాం

జిల్లాను అగ్రగామిగా నిలుపుదాం

సమస్యల పరిష్కారంలో స్పష్టమైన వైఖరి, మూలాలపై దృష్టి అవసరం ముందస్తు ప్రణాళికలు, వ్యూహాలు – శీఘ్ర పరిష్కారమే లక్ష్యం ప్రభుత్వం కార్యక్రమాల అమలులో నిబద్ధత, పారదర్శకత తప్పనిసరి ప్రజలకు నమ్మకంతో కూడిన పరిపాలన మన ముందు ఉన్న ప్రధాన లక్ష్యం కలెక్టరేట్‌లో అధికారులతో తొలి సమావేశంలో కలెక్టర్‌ కృతిక శుక్లా

నరసరావుపేట: ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను అర్థం చేసుకొని కలిసి కట్టుగా పనిచేసి వాటిని పరిష్కరిస్తూ జిల్లాను అగ్రగామిగా నిలుపుదామని నూతన జిల్లా కలెక్టర్‌ కృతిక శుక్లా అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లా కొత్త కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆమె జిల్లా అధికారులతో తొలి సమావేశం నిర్వహించారు. ఆమె జిల్లా పరిపాలనలో తీసుకోబోయే చర్యలు, రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత కార్యక్రమాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు, కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో చర్చించాల్సిన పలు అంశాలపై స్పష్టమైన సూచనలు చేశారు. ప్రతి శాఖలో పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులు, దరఖాస్తులు, కేసులను సమగ్రంగా పరిశీలించి తక్షణ పరిష్కారం చూపాలని ఆదేశించారు. సమస్యలను సగటు దృష్టితో కాకుండా, మూల కారణాలను గుర్తించి శాశ్వత పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, క్షేత్ర స్థాయిలో సమస్యలు మూడో వ్యక్తి ద్వారా తన వద్దకు రాకుండా ముందుగానే అధికారులే గుర్తించి వాటికి తగిన పరిష్కార సూచనలతో రావాలన్నారు. సమస్యలు తలెత్తిన తరువాత చర్యలు తీసుకోవడం కాకుండా, ముందుగానే సమస్యల నివారణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. వర్షాకాలం, వరదలు, తాగునీటి సమస్యలు, రహదారి మరమ్మతులు వంటి అంశాలను ముందుగానే అంచనా వేసి చర్యలు తీసుకోవాలని, ప్రజల ఆకాంక్షలను తీర్చడం, వారికి కావాల్సిన సౌకర్యాలను సమయానికి అందించడం లక్ష్యం కావాలని ఆమె స్పష్టంచేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి, పేదల సంక్షేమ కార్యక్రమాలు జిల్లా స్థాయిలో సమర్థవంతంగా అమలవ్వాలని అన్నారు. జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అన్ని స్థాయిల్లో పరిపాలనలో బాధ్యతాయుత ధోరణి కనబరచాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థల ద్వారా అందిస్తున్న సేవలు ప్రజలకు నిజ సమయంలో చేరేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. కలెక్టరేట్‌కు అర్జీదారులు ఎక్కువగా వస్తున్నారని, వాస్తవంగా డివిజన్‌, మండల పరిధిలో వారి సమస్యల పరిష్కారానికి అధికారులు సరైన విధంగా చర్యలు తీసుకోవడంలో లోపం, ప్రజల సమస్య పూర్తి వివరాలు తెలుసుకోవడంలో చొరవ చూపకపోవడం ప్రధాన కారణం అన్నారు. ఈనెల 15, 16 తేదీల్లో ముఖ్యమంత్రి కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సందర్భంగా జిల్లాకు చెందిన ముఖ్యమైన సమస్యలు, రాష్ట్ర, కేంద్రస్థాయిలో రావలసిన అనుమతులు, నిధుల మంజూరు తదితర అంశాలపై సమగ్ర నివేదిక అందచేయాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. జాయింట్‌ కలెక్టర్‌ సూరజ్‌ గనోరే, జిల్లా రెవెన్యూ అధికారి ఏకా మురళి, ఆర్డీవో కె.మధులత, రమాకాంతరెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement