
దసరా ఏర్పాట్లలో అలసత్వం వద్దు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాల ఏర్పాట్లు నాణ్యత ప్రమాణాలతో ఉండాలని, ఎటువంటి అలసత్వం ఉన్నా, భక్తులకు అసౌకర్యం కలిగినా ఇంజినీరింగ్ అధికారులదే బాధ్యతని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభమయ్యే దసరా ఉత్సవాలను పురస్కరించుకుని చేపట్టిన ఏర్పాట్లను పోలీసు, దేవస్థానం అధికారులతో కలిసి కలెక్టర్ లక్ష్మీశ శనివారం పరిశీలించారు. సుమారు నాలుగు గంటల పాటు ఆలయ పరిసరాల్లో కలియ తిరిగి ఏర్పాట్ల వివరాలు తెలుసుకున్నారు. తను గుర్తించిన పలు లోపాలను ఆలయ ఈఓ శీనానాయక్, ఇంజినీరింగ్ అధికారులకు తెలిపి వెంటనే సరిచేయాలని ఆదేశించారు. తొలుత ఘాట్‌రోడ్డు నుంచి ఆలయ ప్రాంగణంలోని గాలి గోపురం వరకు క్యూ లైన్లలో నడిచి వెళ్లిన కలెక్టర్ లక్ష్మీశ తాగునీరు, క్యూ లైన్ల ఫ్యాన్లను సరి చేయాలని సూచించారు. క్యూలైన్లకు వాడిన ఐరన్ పైపుల వల్ల భక్తులకు గాయాలు కాకుండా చూసుకోవాలని ఆదేశించారు. కొండ దిగువన, క్యూలైన్ల మధ్యలో కార్పొరేషన్ సహకారంతో టాయిలెట్లు ఏర్పాటుచేసి, వాటిని నిరంతరం శుభ్రంగా ఉంచాలన్నారు. పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని, భక్తులకు తాగునీరు, మజ్జిగ, పాలు, బిస్కెట్లను పంపిణీ చేయాలని సూచించారు. లక్ష్మీగణపతి విగ్రహం వద్ద గతంలో కొండ రాళ్లు విరిగి పడిన ప్రదేశాన్ని కలెక్టర్ పరిశీలించారు. మళ్లీ రాళ్లు విరిగిపడే పరిస్థితులు కనిపిస్తున్నాయని, జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఏడీసీపీ జి.రామకృష్ణ, వెస్ట్ ఏసీపీ దుర్గారావు, దుర్గగుడి ఈఓ శీనానాయక్, ఈఈలు కోటేశ్వరరావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ