
తెనాలి నుంచి తీరాలు దాటిన ప్రతిభ
ఇంటర్న్ నుండి గ్లోబల్ లీడర్ వరకు అనుదీప్ ముత్తవరపు ప్రస్థానం కొత్త సాంకేతిక పరిజ్ఞానంలో సత్తా చాటిన అనుదీప్ కేంద్ర ప్రభుత్వం నుంచి ‘యూత్ ఐకాన్’ ప్రత్యేక గుర్తింపు
తెనాలి: ఒక చిన్న స్టార్టప్ కంపెనీలో చేరిన పదేళ్ల లోనే ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఒకటైన సంస్థలో అతి పిన్నవయస్కుడైన సీనియర్ డైరెక్టర్‌గా అనుదీప్ ముత్తవరపు ఎదిగారు. క్లౌడ్, డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో సాంకేతికతలకు నాయకత్వం వహిస్తున్నారు. ఆరు దేశాల్లో విస్తరించిన రెండు వందలమంది సభ్యుల బృందాన్ని నిర్వహిస్తూ, ప్రపంచవ్యాప్తంగా అత్యవసర సేవల సిబ్బందికి సాధికారత కల్పించే పది బిలియన్ డాలర్ల పోర్టుఫోలియోకు మార్గదర్శకత్వం వహిస్తున్నారు. ఆ కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ‘యూత్ ఐకాన్’ గౌరవాన్ని అందించింది.
చదువుకునే దశ నుంచే..
అనుదీప్ ముత్తవరపు సొంతూరు తెనాలి సమీపంలోని వరహాపురం. తండ్రి ఉద్యోగరీత్యా తెలంగాణాకు వెళ్లారు. గుంటూరు జిల్లాలోని కేఎల్ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో అనుదీప్ ఇంజినీరింగ్ చదివారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో టెలీ కమ్యూనికేషన్స్‌లో మరో మాస్టర్స్ డిగ్రీ చేశారు. నార్త్ వెస్టర్న్ కెల్లోగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ చదివారు. విద్యార్థి దశలోనే పలు కార్యక్రమాలను చేపట్టి గుర్తింపు పొందారు. కేఎల్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదివేటప్పుడే స్టూడెంట్ ఆర్డినెన్స్‌కు అధ్యక్షుడిగా పనిచేశారు. కెల్లోగ్ స్కూలు ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ చేసినప్పుడు చూపిన ప్రతిభకు ‘డీన్స్ లీడర్‌షిప్ అవార్డు’ను పొందారు.
పిన్నవయస్కుడు ఆయనే...
2015లో టెక్సాస్‌లోని ప్లానోలో ఉన్న కోడియాక్ అనే చిన్న స్టార్టప్ టెక్నాలజీ సంస్థలో ఇంటర్న్‌గా అనుదీప్ కెరీర్ ప్రారంభించారు. 2017లో మోటరోలా సొల్యూషన్స్ కంపెనీ కోడియాక్‌ను టేకోవర్ చేసింది. కొద్ది సంవత్సరాల్లోనే ఇంజినీర్ నుండి మేనేజర్, డైరెక్టర్ పదవుల నుండి ఏకంగా సీనియర్ డైరెక్టర్ స్థాయికి ఎదిగారు. మోటరోలా కంపెనీ చరిత్రలోనే ఆ పదవిని పొందిన అతి పిన్న వయస్కుడిగా అనుదీప్ గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆరు దేశాల్లో గల ఆయన బృందంలోని 200 మంది సభ్యుల్లో ఎక్కువమంది ఆయనతోపాటు ఉద్యోగాలు చేసినవారే ఉన్నారు. ప్రజా భద్రతా సాంకేతికతలకు అందించిన సేవలకుగాను అనుదీప్, గత జనవరిలో కేంద్ర యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి ‘యూత్ ఐకాన్–2025’ అవార్డు స్వీకరించారు. గుంటూరుకు చెందిన విశ్రాంత కాలేజీ ప్రిన్సిపాల్ కొల్లి కృష్ణప్రసాద్ కుమార్తె, డల్లాస్‌లోనే డేటా సైంటిస్ట్‌గా చేస్తున్న సుస్మితతో అనుదీప్‌కు నాలుగేళ్ల క్రితం వివాహమైంది.

తెనాలి నుంచి తీరాలు దాటిన ప్రతిభ