
పల్నాడు నూతన ఎస్పీగా బి.కృష్ణారావు
నరసరావుపేట రూరల్: పల్నాడు జిల్లా ఎస్పీగా 2014 బ్యాచ్ ఐపీఎస్ అధికారి బి.కృష్ణారావు నియమితులయ్యారు. ప్రస్తుతం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న కృష్ణారావును పల్నాడు జిల్లాకు బదిలీచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2014 నుంచి 2016 వరకు ప్రొబేషనరి ఐపీఎస్‌గా ఉన్నారు. 27.12.2016 నుంచి 31.08.2017 వరకు విజయవాడ గ్రేహాండ్స్ అసిస్టెంట్ కమాండర్‌గా పనిచేశారు. 1.9.2017 నుంచి 9.06.2018 వరకు పులివెందుల ఏఎస్పీగా, 21.07.2018 నుంచి 31.10.2018 వరకు తుళ్లూరు ఏఎస్పీగా విధులు నిర్వర్తించారు. 3.11.2018 నుంచి 6.3.2020 వరకు నర్సీపట్నం ప్రత్యేక అధికారిగా బాధ్యతలు నిర్వర్తించారు. 7.3.2020 నుంచి 13.6.2020 వరకు 6వ బెటాలియన్ కమాండెంట్‌గా, 14.6.2020 నుంచి 1.4.22 వరకు విశాఖపట్నం ఎస్పీగా, 3.4.2022 నుంచి 6.9.2023 వరకు ఏసీబీ ఎస్పీగా విధులు నిర్వర్తించారు. 15.07.24 నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీగా పనిచేస్తూ పల్నాడు జిల్లాకు బదిలీ అయ్యారు.
రూ.4.60 కోట్లు కక్షిదారులకు
అందిన పరిహారం
నరసరావుపేటటౌన్: జాతీయ లోక్ అదాలత్‌లో 571 కేసులు పరిష్కారం కాగా, కక్షిదారులకు రూ.4.60 కోట్ల పరిహారం కింద లభించిందని 13వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎన్.సత్యశ్రీ తెలిపారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు అదనపు జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్ అదాలత్‌ను నిర్వహించారు. న్యాయమూర్తులు మూడు బెంచ్‌లుగా ఏర్పడి రాజీ మార్గంలో కేసులు పరిష్కరించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు కె.మధుస్వామి, ఎ.సలోమి, న్యాయవాద సంఘ అధ్యక్షులు జి.సుబ్బారావు, అదాలత్ సభ్యులు కె.శివకోటేశ్వరరావు, కె.సునీల్ సింగ్, ఎం.భూదేవమ్మ తదితరులు పాల్గొన్నారు.
అనారోగ్యంతో భార్య, పురుగుమందు తాగి భర్త మృతి
నాదెండ్ల: వృద్ధాప్యంలో బతుకు భారమై దంపతులు మృతి చెందిన విషాదకర సంఘటన శనివారం పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం కనపర్రు గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు కనపర్రు గ్రామానికి చెందిన బండారుపల్లి నారాయణ (77) అలివేలు (75) దంపతులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వీరి కుమారుడు, కుమార్తెలకు వివాహాలై వేరుగా ఉంటున్నారు. శుక్రవారం అర్ధరాత్రి భార్య అలివేలు ఆరోగ్యం క్షీణించి మృతి చెందింది. భార్య మృతిని తట్టుకోలేకపోయిన భర్త నారాయణ ఇంట్లో ఉన్న పురుగుమందు తాగి మృతి చెందాడు. వృద్ధ దంపతుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
అమరావతి: అమరావతిలోని అమరేశ్వరున్ని శనివారం రాత్రి కర్ణాటక రాష్ట్రంలోని హల్దీపూర్ వైశ్యపీఠం మఠాధిపతి, వైశ్య కుల గురువు వామనాశ్రమం మహాస్వామి దర్శించుకున్నారు. తొలుత ఆలయ అర్చకులు స్వామిజీకి స్వాగతం పలికి దేవాయలంలోకి ఆహ్వానించారు. అమరేశ్వరునికి, బాలచాముండేశ్వరిదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారికి స్వయంగా ప్రత్యేక పూజలు చేసి భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. కారక్రమంలో వైశ్య సంఘ నాయకుడు పులిపాటి పవన్‌కుమార్ పాల్గొన్నారు.

పల్నాడు నూతన ఎస్పీగా బి.కృష్ణారావు

పల్నాడు నూతన ఎస్పీగా బి.కృష్ణారావు