సాక్షి, నరసరావుపేట: కూటమి ప్రభుత్వ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధరలు లభించక నష్టపోతున్నారు. గతంలో రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు ఆర్‌బీకే కేంద్రాలలో లభించేవి. ప్రస్తుతం వాటిని రైతు సేవా కేంద్రాలుగా పేరుమార్చి నిర్వీర్యం చేశారు. జిల్లాలో రైతులకు అవసరమైనంత యూరియాను సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమైంది. మరోవైపు అధికారపార్టీ నేతలు, ప్రైవేట్ వ్యాపారులు జిల్లాలో యూరియాను కృత్రిమ కొరత సృష్టించి రైతులను నిలువునా దోచుకుంటున్నారు.
గత పదిహేను రోజులుగా రైతులు యూరియా బస్తాల కోసం కుస్తీలు పడుతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదు. దీంతో రైతులు పక్షాన నిలిచే పోరాడే వైఎస్సార్ సీపీ నేడు పోరుబాటకు పిలుపునిచ్చింది. రాష్ట్రంలోని అన్ని ఆర్డీఓ కార్యాలయాల వద్ద రైతులు, నేతలు, కార్యకర్తలతో పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లి ఆర్డీఓలకు వినతిపత్రం ఇవ్వనున్నారు.
బస్తాపై అ‘ధనం’
జిల్లాలో యూరియా కొరత రైతులను వేధిస్తోంది. రైతులకు సరిపడా ఎరువుల నిల్వలు ఉన్నాయని అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో రైతులకు అందడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే పంటల సాగు కష్టమవుతుందనే భావన అన్నదాతల్లో నెలకొంది. కొరతను సాకుగా చూపి వ్యాపారులు అధిక ధరకు యూరియాను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. యూరియా కోసం దుకాణాలకు వెళ్తున్న రైతులకు వ్యాపారులు చుక్కలు చూపిస్తున్నారు. యూరియా ధరను ప్రభుత్వం రూ.266 గా నిర్ణయించగా, మార్కెట్లో రూ.480 వరకు విక్రయిస్తున్నారు. బస్తాకు రూ.200 అధికంగా రైతుల నుంచి వసూళ్లు చేస్తున్నారు. మార్కెట్లో యూరియా అందుబాటులో లేకపోవడంతో అధిక ధరకు విక్రయించాల్సి వస్తుందని వ్యాపారులు చెబుతున్నారు.
ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం
రైతులకు అవసరమైన ఎరువులను సంతృప్తికర స్థాయిలో అందుబాటులో ఉంచడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఉన్న అరకొర నిల్వలను ఎరువుల మాఫియాగా మారిన కొందరు అక్రమదారులు ఇతర ప్రాంతాలకు తరలించి మరింత కొరతను సృష్టిస్తున్నారు. ఒకవైపు సరిహద్దు తెలంగాణ జిల్లాలకు ఇక్కడి యూరియాను తరలించి బ్లాక్ మార్క్‌ట్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు, మరోవైపు ఇక్కడి యూరియా నిల్వలు తరలిపోవడంతో రైతులకు అవసరానికి తగ్గట్టు లేకపోవడంతో డిమాండ్ పెరిగి ధరలు రెట్టింపు అవుతున్నాయి. దీనివల్ల రెండు రకాలుగా యూరియా మాఫియాకు ఆదాయంగా మారింది.
తెలంగాణ కు ఇబ్బడిముబ్బడిగా..
గత నెల రోజులుగా పల్నాడు జిల్లా నుంచి వేల టన్నుల యూరియా పక్కదారి పట్టింది. పక్క రాష్ట్రంలోని పారిశ్రామిక అవసరాలకు సైతం మన యూరియానే సరఫరా అవుతుండటం మరింత ఇబ్బందికరంగా మారుతోంది. యూరియా అక్రమ రవాణాను అడ్డుకోవడంలో ప్రభుత్వం, అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. పది రోజుల క్రితం దాచేపల్లి మండలం పొందుగల వద్ద దొరికిన ఒకటి రెండు సంఘటనలు తప్ప పెద్దగా కట్టిడిచేసిన దాఖలాలు కనిపించడంలేదు. పొందుగల వద్ద రెండు వాహనాలలో తరలిస్తున్న 165 బస్తాలలోని 7,425 కిలోల యూరియాను విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు.
రైతు సేవా కేంద్రాలు నిర్వీర్యం
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఎరువుల కొరతను వ్యాపారులు సృష్టించకుండా ఉండేందుకు ఆర్‌బీకేల్లో సీజన్‌కు అవసరమయ్యే ఎరువులను అందుబాటులో ఉంచేవారు. దీంతో స్థానికంగా ఎరువులు అందుబాటులో ఉండటంతో రైతులు నిశ్చింతగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యేవారు. కూటమి ప్రభుత్వం రైతుసేవా కేంద్రాలను నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తుంది. ఆర్‌ఎస్‌కేలకు నామమాత్రంగా ఎరువులను కేటాయిస్తుంది. దీంతో పాటు సొసైటీల ద్వారానే ఎరువులను పంపిణీ చేస్తుంది. అధికార పార్టీ సానుభూతిపరులకే ఆర్‌ఎస్‌కేలు, సొసైటీలు, జీడీసీఎంఎస్‌లకు కేటాయించిన ఎరువులు అందుతున్నాయి. దీంతో యూరియూ కోసం పడిగాపులు కాయాల్సి వస్తుంది.
కూటమి ప్రభుత్వం విఫలమైంది
రాష్ట్రంలో రైతులు అన్ని విధాల కష్టాలపాలవుతున్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కనీసం రైతులకు అవసరమైన యూరియాను అందుబాటులో ఉంచడం కూడా చేతకాక చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలో రైతుల పక్షాన పోరాడేందుకు వైఎస్సార్ సీపీ తరఫున నేడు అన్ని ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. రైతులంతా పాల్గొని పోరుబాటను విజయవంతం చేయాలి.
– పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు
వ్యాపారులు చెప్పిన ధరకు కొంటున్నాం
ఎరువుల కోసం దుకాణాలకు వెళ్తే వ్యాపారులు చెప్పిన ధరకు కొనుగోలు చేయాల్సి వస్తుంది. ప్రభుత్వం నిర్ణయించిన ఎమ్మార్పీకి ఎక్కడా యూరియా అమ్మడం లేదు. బస్తాకు రూ.200 అధికంగా చెల్లిస్తేనే యూరియా అమ్ముతున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
– చెంచయ్య, రైతు, గోనెపూడి
ఎరువులు అందుబాటులో ఉంచాలి...
యూరియా కొరత పేరుతో వ్యాపారులు అధిక ధరకు విక్రయాలు సాగిస్తున్నారు. ఎరువుల పంపిణీపై ప్రభుత్వ పర్యవేక్షణ లేకుండా పోయింది. దీంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా అధిక ధరలకు విక్రయిస్తున్నారు. వ్యవసాయ అధికారులు స్పందించి ఎరువులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి.
– అన్నెం పున్నారెడ్డి, వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు
సాగు సగమైనా కాలేదు..
పల్నాడు జిల్లాలో సెప్టెంబర్ మాసం మొదటి వారానికి ఖరీఫ్ సాగు 50 శాతం కూడా పూర్తికాలేదు. ఇప్పుడిప్పుడే వరి, మిర్చి సాగు పనులు ముమ్మరమవుతున్నాయి. అయితే జిల్లాలో యూరియా అమ్మకాలు మాత్రం దాదాపుగా పూర్తి అయ్యాయి. ఇది ఎలా సాధ్యమంటే.. మాఫియా సభ్యులు స్థానిక రైతుల పేర్లతో యూరియా కొనుగోలు చేసినట్టు చూపి ఆ బస్తాలను సరిహద్దులు దాటిస్తున్నారు. అయితే సాగు తక్కువగా ఉన్న సమయంలో అంత యూరియా ఎలా విక్రయించారో వ్యాపారులను నుంచి ఆరా తీస్తే అసలు విషయం బయటపడేది. కానీ వ్యవసాయశాఖ ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో ఎరువుల మాఫియా రెచ్చిపోయి రైతులను కొల్లగొడుతున్నారు. ముఖ్యంగా కారంపూడి, వినుకొండ, మాచర్ల, పిడుగురాళ్ల లాంటి ప్రాంతాల నుంచి యూరియా పక్కదారి పడుతోంది.

యూరియా బస్తాల కోసం కుస్తీలు