అమరావతి: ప్రసిద్ధ శైవ క్షేత్రం అమరావతి అమరేశ్వరాలయంలో చంద్ర గ్రహణానంతరం సోమవారం అమరేశ్వరునికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. సోమవారం వేకువజామున ఆలయశుద్ధి అనంతరం ఆలయ స్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖరశర్మ ఆధ్వర్యంలో సంప్రోక్షణ కార్యక్రమంలో భాగంగా విశ్వేశ్వర పూజ, నవగ్రహ మంటపారాధన, పుణ్యహావాచన నిర్వహించి అనంతరం పుణ్యహావాచన జలాలను మేళ తాళాలతో అమరేశ్వరునికి అభిషేకించారు, అలాగే బాలచాముండేశ్వరి అమ్మవారికి, ఉపాలయాల్లో అభిషేకం నిర్వహించారు. ఉదయం 8 గంటలకు భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు.
జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబు
నరసరావుపేట: యూరియాపై రైతుల్లో ఆందోళనలు తొలగిస్తూ వాస్తవ పరిస్థితులను వివరించేందుకు గ్రామస్థాయిలో అవగాహన బృందాలను ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు వెల్లడించారు. వీఆర్వో, మహిళా పోలీసు, వ్యవసాయ, ఉద్యాన సహాయకులు బృందంలో సభ్యులుగా వ్యవహరిస్తారన్నారు. సోమవారం యూరియా అంశంపై కలెక్టర్ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ బృందాలు ప్రతి రైతు వద్దకు వెళ్లి జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్న విషయం వివరించాలన్నారు. యూరియా పొందడంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, సాగుచేసిన భూమికి అవసరమైన యూరియా రైతులకు లభించిందా అనే అంశాలపై అధికారులకు నివేదిస్తారన్నారు. జిల్లాలో యూరియా కొరత లేదన్న విషయం స్పష్టం చేస్తూనే, అవసరానికి మించి యూరియా కొనుగోళ్లు చేయవద్దని రైతులకు విజ్ఞప్తి చేయాలన్నారు. రానున్న మూడు రోజులు మండల స్పెషల్ ఆఫీసర్లు మండలాల్లోనే ఉండి యూరియా పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలన్నారు.
దయ కలిగిన తల్లి వేళాంగణిమాత
పాలువాయిజంక్షన్(రెంటచింతల): దయ కలిగిన తల్లి వేళాంగణిమాత అని రాయవరం విచారణ గురువులు రత్నబాబు అన్నారు. పాలువాయి జంక్షన్‌లోని వేళాంగణిమాత మందిరం 26వ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం కానుకమాత చర్చి విచారణ గురువులు రె.ఫాదర్ ఏరువ లూర్ధుమర్రెడ్డి నేతృత్వంలో సమష్టి పవిత్ర దివ్యపూజాబలిని సమర్పించారు. ఫాదర్ రత్నబాబు మాట్లాడుతూ వేళాంగణిమాతలోని ప్రేమ, దయ, కరుణ, క్షమాపణ, వినయం, విశ్వాసం, శాంతి, సమాధానాలు వంటి సుగుణాలను క్రైస్తవులు అలవర్చుకొని దేవుని కృపకోసం ప్రార్థించాలన్నారు. అనంతరం మందిరం వ్యవస్థాపకులు దుగ్గింపూడి అనిత కస్పారెడ్డి నేతృత్వంలో భక్తులకు మహా అన్నదానం చేశారు. తుమృకోట విచారణ గురువులు రె.ఫాదర్ పవిత్రన్, ఫాదర్ కొణతం ఏలీషా రాజు, కన్యసీ్త్రలు, చర్చిపెద్దలు, భక్తులు పాల్గొన్నారు.