
‘అన్నదాత పోరు’ జయప్రదం చేయండి
మాచర్ల రూరల్/మాచర్ల: తగినంత యూరియాను అందుబాటులో ఉంచకుండా రైతులను కష్టాల పాలు చేస్తున్న ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు నేడు అన్నదాత పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(పీఆర్కే) తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రైతన్నలు యూరియా కోసం రోజుల తరబడి క్యూ లైన్లలో నిల్చోవటం దారుణమన్నారు. యూరియా కొరతను అదుపులోకి తేవటంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ పాలనలో ఆర్బీకేల ద్వారా రైతులకు కావాల్సిన యూరియా, ఎరువులు అందించినట్లు గుర్తు చేశారు. నేడు ఉదయం 10.30గంటలకు గురజాల పార్టీ ఆఫీసు నుంచి గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డితో కలిసి ఆర్డీఓ కార్యాలయం వరకు పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించి ఆర్డీఓకు వినతిపత్రం అందజేయటం జరుగుతుందని ఆయన తెలిపారు. అనంతరం పార్టీ రాష్ట ఎస్టీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు బుల్లా మేరీకుమారి, ఇతర మహిళా నేతలతో కలిసి అన్నదాత పోరు పోస్టర్లను పీఆర్కే ఆవిష్కరించారు.
విజయవంతం చేద్దాం : డాక్టర్ గోపిరెడ్డి
నరసరావుపేట: రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వైఎస్సార్ సీపీ పిలుపు మేరకు మంగళవారం ఉదయం 10 గంటలకు నరసరావుపేట పట్టణ రెవెన్యూ డివిజన్ పరిధిలో నిర్వహించే అన్నదాత పోరు కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులందరూ విరివిగా పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. తనతోపాటు మాజీ మంత్రి విడదల రజని, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో యూరియా, ఎరువుల కొరతపై స్థానిక లింగంగుంట్ల జిల్లా పార్టీ ఆఫీస్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు వెళ్లి ఆర్డీఓకు వినతిపత్రం ఇవ్వడం జరుగుతుందన్నారు. నరసరావుపేట, వినుకొండ, చిలకలూరిపేట నియోజకవర్గ రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.
వైఎస్సార్ సీపీ పల్నాడు
జిల్లా అధ్యక్షుడు పీఆర్కే