
పోలీసుల అదుపులో భర్త..
భార్య ఆత్మహత్యాయత్నం
ఉత్తరం రాసి ఎలుకల మందు తాగిన వైనం లేఖలో చిలకలూరిపేట ఎమ్మెల్యే పేరు ప్రస్తావన
చిలకలూరిపేట: తన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారంటూ ఓ మహిళ ఎలుకల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంఘటన చిలకలూరిపేట పట్టణంలో సోమవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణంలోని సాయికార్తీక్ సిటీ సెంటర్ కాంప్లెక్స్‌కు సంబంధించి గత కొంతకాలంగా వివాదం నెలకొని ఉంది. సిటీ సెంటర్ యజమాని, అమెరికాలో నివాసం ఉండే ఎన్‌ఆర్‌ఐ రావి మురళి తమకు అప్పు ఉన్నాడంటూ కొంతమంది గత కొంతకాలంగా కాంప్లెక్స్ ముందు టెంట్ వేసుకొని నిరసన తెలుపుతున్నారు. ఈ కాంప్లెక్స్ పక్కన ఐస్ ఫ్యాక్టరీ నిర్వహించే పరమట వెంకటరమణ రావి మురళివద్ద ఉద్యోగిగా ఉన్నాడు. ఇతనిని ఒక కేసు విషయమై చిలకలూరిపేట రూరల్ పోలీసులు సోమవారం పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లారు. దీంతో ఆందోళనకు గురైన వెంకటరమణ భార్య తులసి ఉత్తరం రాసి ఆత్మహత్యయత్నం చేసింది. ఉత్తరంలో తన భర్తను అన్యాయంగా పోలీసులు తీసుకువెళ్లారని, తన భర్తకు ఏదైనా జరిగితే తాను తట్టుకోలేనని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను అని రాసింది. దీనికి కారణం టెంట్‌లో కూర్చొన్న వారు, ఎమ్మెల్యే పుల్లారావు, పోలీసులు బాధ్యులని పేర్కొంది.
● ఘటనపై బాధితుడు వెంకటరమణ స్పందిస్తూ తనపై ఏ కేసు పెట్టారో తెలియదని, రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లి సంతకాలు పెట్టించుకొని పంపించి వేశారని, ఈ నేపథ్యంలో తన భార్య ఆత్మహత్యాయత్నం చేసిందని తెలిపాడు. రూరల్ సీఐ బి.సుబ్బానాయుడును ఫోన్లో వివరణ కోరగా క్రైమ్ నంబర్ 151 /24 నమోదై ఉన్న కేసులో స్టేషన్‌కు పిలిపించి 41 నోటీసు ఇచ్చి పంపించి వేశామని తెలిపారు. ఎలుకల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన తులసి పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చేరి చికిత్స పొందుతోంది. ఇదిలాఉండగా.. తాను సోషల్ మీడియాలో పోస్టులు పెడితే తన వద్ద పనిచేస్తున్న వెంకటరమణను వేధిస్తున్నారని ఎన్‌ఆర్‌ఐ రావి మురళి సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టడం విశేషం.