
ముస్లిం మైనార్టీలపై కూటమి వివక్ష
మౌజన్లు, ఇమామ్‌లకు తక్షణమే బకాయిలు చెల్లించాలి మైనార్టీ ఆస్తులకు వైఎస్సార్ సీపీ అండ పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన డాక్టర్ గోపిరెడ్డి, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు పీఎస్ ఖాన్
మైనార్టీలకు అన్యాయం
నరసరావుపేట: కూటమి ప్రభుత్వం ముస్లిం మైనా ర్టీలకు అందజేయాల్సిన సంక్షేమ పథకాలు, ఎన్నికల హామీలను అమలుచేయకుండా వివక్ష చూపుతోందని వైఎస్సా ర్‌సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. సోమవారం పార్టీ ముస్లిం మైనార్టీసెల్ జిల్లా అధ్యక్షుడు పీఎస్ ఖాన్, నియోజకవర్గాల నాయకులతో కలిసి ప్రజాసమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్)లో మైనార్టీల సమస్యలపై జిల్లా కలెక్టర్‌కు నివేదించేందుకు కలెక్టరేట్‌కు తరలి వచ్చారు. అయితే ప్రవేశద్వారం వద్దకు వచ్చిన వారిని గేటు మూసేసి లోపలికి వెళ్లేందుకు పోలీసులు అడ్డుకున్నారు. కేవలం పది మందిని మాత్రమే లోపలికి అనుమతిస్తామని పోలీసులు చెప్పగా.. పదిమందితో లోపలికి వెళ్లి కలెక్టర్‌కు సమస్యలతో కూడిన వినతిపత్రం సమర్పించారు. అనంతరం డాక్టర్ గోపిరెడ్డి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ముస్లింలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయకుండా మోసం చేసిందన్నారు. మౌజమ్‌లు, ఇమామ్‌లకు 11 నెలల నుంచి గౌరవ వేతనాలు చెల్లించడంలేదన్నారు. తక్షణమే వారికి జీతాల బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు.
పార్టీ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు పీఎస్ ఖాన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర దాటుతున్నా ఇప్పటివరకు జిల్లాలో ఖబర్‌స్థాన్, షాధీఖానాలకు కమిటీలు వేయలేదన్నారు. దుల్హన్ పథకం అమలుచేయలేకపోయారన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి జలీల్, నరసరావుపేట పట్టణ అధ్యక్షుడు షేక్ కరిముల్లాలు మాట్లాడగా, మున్సిపల్ విభాగం జిల్లా అధ్యక్షుడు షేక్ రెహమాన్, నియోజకవర్గ మైనార్టీసెల్ అధ్యక్షుడు షేక్ సిలార్‌బాష, జిల్లా కార్యదర్శి సయ్యద్‌ఖాదర్‌బాష, పొదిలే ఖాజా, వరవకట్ట బుజ్జి తదితర మైనార్టీసెల్ నాయకులు పాల్గొన్నారు.