
రాష్ట్రమంతా అంటూ ఊదరొట్టారు
ఎన్నికల ముందు కూటమి నేతలు ఇంటింటికి తిరిగి రాష్ట్రమంతా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ఊదరగొట్టారు. తాజాగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కేవలం పల్లె వెలుగు, అల్ట్రా డీలక్స్ బస్సులలో మాత్రమే సదుపాయం ఉంటుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి వెల్లడించారు. దీనిపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఎక్కడా పల్లెవెలుగు, అల్ట్రా డీలక్స్ బస్సులలో మాత్రమే ఉచితమని చెప్పలేదు. తీరా అధికారం చేపట్టిన తరువాత చంద్రబాబు తన సహజ బుద్ధిని బయటపెట్టి హామీలో కోతలు పెట్టాడని మహిళలు ఆరోపిస్తున్నారు. చిరువ్యాపారాలు, అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, విద్యా ర్థినులు పట్టణాలకు వెళ్లాలంటే ఎక్స్‌ప్రెస్, సూపర్ లగ్జరీ సర్వీసులు ఎక్కువగా ఉంటాయి, వాటిలో ప్రయాణ సదుపాయం ఇవ్వకపోతే ఉపయోగమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడున్న ఒకటి అర పల్లెవెలుగు బస్సులో ప్రయాణించడం కష్టమని పెదవి విరుస్తున్నారు.