
కంది వైపు ఖరీఫ్ రైతు
సాక్షి, నరసరావుపేట : ప్రధాన పంటల సాగుకు ఖర్చు విపరీతంగా పెరగడం, రాబడి అంతంత మాత్రంగా ఉండటంతో జిల్లా రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా కంది సాగు ఏడాదికేడాదికి పెరుగుతోంది. పత్తి సాగులో సవాలక్ష సవాళ్లు ఎదురవుతున్నాయి. విత్తనాలు, ఎరువులు కల్తీ మొదలు, సాగు ఖర్చు అధికంగా ఉంటోంది. మరోవైపు గులాబీ రంగు పురుగు బెడద అధికంగా ఉంటోంది. చీడ, పీడలతో పత్తి దిగుబడి తగ్గిపోతోంది. మరోవైపు ధరలు తగ్గిపోతున్నాయి. ఆ ధరలతో పత్తి సాగు గిట్టుబాటు కావడం లేదు. దీంతో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి పెడుతున్నారు. అలాగే
మిర్చి పంటలోను రైతులు గతేడాది కోలుకోలేని దెబ్బతిన్నారు. ఇప్పటికీ కోల్డ్ స్టోరేజ్‌లలో సరుకు ఉంచారు. దీంతో కంది సాగుతోనైనా తమ వెతలు తీరుతాయని భావిస్తున్నారు. 2023 ఖరీఫ్‌లో 14,626 హెక్టార్లలో కంది సాగు చేశారు. 2024 ఖరీఫ్ కంది సాగు లక్ష్యం 19,259 హెక్టార్లు కాగా ఏకంగా 26,509 హెక్టార్లలో సాగైంది. ఈ ఏడాది కంది సాగు 30 వేల హెక్టార్లు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
పెట్టుబడి తక్కువ...ధర ఎక్కువ
కంది సాగుకు ఎకరాకు రూ.10–15 వేల మధ్య ఖర్చవుతుంది. ఇది మిగిలిన పంటలతో పోల్చితే చాలా తక్కువ. బెట్ట పరిస్థితులకు నిలబడే స్వభావం ఉంటుంది. డిసెంబర్, జనవరి నెలల్లో పంటకోతకు వస్తుంది. కాయదశలో తెగుళ్లు ఆశించకుండా పంటను కాపాడుకుంటే రైతులకు ఆదాయం వస్తుంది. హెక్టారుకు 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కంది పంటకు గిట్టుబాటు ధరను కేంద్ర ప్రభుత్వం 2022లో క్వింటాలు రూ.6,300, 2023లో రూ.7,వేలు ప్రకటించగా గతేడాది రూ.7,550 చొప్పున ప్రకటించారు. ఈ ఏడాది మరో రూ.450 బోనస్‌గా ప్రకటించి క్వింటాలు ధర రూ.8 వేలు చేశారు.
ప్రభుత్వ మద్దతు లేకపోవడంతో...
పల్నాడు జిల్లాలో వినుకొండ, మాచర్ల, పిడుగురాళ్ల, దుర్గి, నరసరావుపేట ప్రాంతాలలో దాల్ మిల్లులు అధిక సంఖ్యలో ఉన్నాయి. దీంతో వ్యాపారులు నేరుగా కొనుగోలు చేయడం రైతులకు కలసి వచ్చేది. అయితే గతేడాది కూటమి ప్రభుత్వం కంది కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో విఫలమైంది. రైతుల నుంచి వ్యాపారులు నేరుగా కంది కొనుగోలు చేయకపోవడంతో దళారుల ఇష్టారాజ్యమైంది. కనీస మద్దతు ధర రూ.7,550 ఉన్నప్పటికి రైతుకు రూ.6 వేలు కూడా దక్కని దుస్థితి.
ప్రభుత్వం సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి నేరుగా కొంటే మద్దతు ధర లభించి ఆదాయం దక్కుతుంది. మరోవైపు గత ప్రభుత్వంలో కంది పంటకు బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించేది. కూటమి ప్రభుత్వంలో రైతులే చెల్లించాల్సిన దుస్థితి నెలకొంది. మరోవైపు కంది రైతులకు ఆర్‌బీకేల ద్వారా ఎల్‌ఆర్‌జీ–22 వంటి దీర్ఘకాలిక రకాలైన కంది విత్తనాలను రాయితీతో అందజేస్తారు. అయితే రైతులు తక్కువ వ్యవధిలో పంట పూర్తి కావడంతోపాటు చీడపీడలను తట్టుకొనే హైబ్రిడ్ రకాలను సాగు చేస్తారు. దీంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించి అధిక ధరలకు హైబ్రిడ్ విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు.
పత్తి, మిర్చి సాగుకు వెనుకాడుతున్న రైతులు
2023 ఖరీఫ్‌లో 14,626 హెక్టార్లు, 2024లో
26,509 హెక్టార్లలో కంది సాగు
ఈ ఏడాది 30 వేల హెక్టార్లలో సాగుకు అవకాశం
ఖర్చు తక్కువ, గిట్టుబాటు ధరతో లాభాలు ఎక్కువ
జిల్లాలో పత్తికి ప్రత్యామ్నాయంగా సాగు
కంది సాగుపై గంపెడు ఆశలు....
గత ఖరీఫ్ సీజన్‌లో ఎన్నో ఆశలతో వ్యయ ప్రయాసలతో పత్తి, మిర్చి సాగు చేసి తీవ్రంగా నష్టపోయాను. మద్దతు ధర లభించక వచ్చినకాడికి అమ్మి తీవ్రంగా నష్టపోయాం. కందికి తక్కువ పెట్టుబడి కావడంతో సాగుకు సిద్ధంగా ఉన్నాం. గతేడాది ప్రకృతి సహకరించకపోవడంతో దిగుబడి తగ్గింది. వచ్చిన పంటను అమ్మే సమయంలో దళారులు తక్కువకే కొనుగోలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్‌కు క్వింటాలుకు రూ.8 వేలు మద్దతు ధర ప్రకటించడంతో కంది సాగుకు మొగ్గు చూపుతున్నాం.
– పుచ్చకాయల రామకృష్ణ, రైతు, తేరాల
గ్రామం, దుర్గి మండలం

కంది వైపు ఖరీఫ్ రైతు