బొల్లాపల్లి: తన పొలానికి దారి చూపాలంటూ ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. అడ్డుగా ఉన్న గృహాలను తొలగించాలంటూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఉత్తర్వుల అమలులో భాగంగా అధికారులు శుక్రవారం గృహాల కూల్చివేతకు పూనుకున్నారు. తమ ఇళ్లను కూల్చవద్దంటూ బాధితులు వేడుకున్నా అధికారులు కనికరించలేదు. చివరకు కోర్టు కోర్టు స్టేటస్ కో ఆర్డరు ఇవ్వడంతో కూల్చివేతను నిలిపివేశారు. బొల్లాపల్లి మండలం వెల్లటూరు శివారులోని ఆర్ అండ్ బీ రోడ్డుకు ఆనుకుని కొంతమంది పేదలు గృహాలు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. నివాస గృహాలకు ఆనుకుని ఉన్న స్థల యజమాని డి.మల్లికార్జునచారి తన పొలానికి దారి లేదంటూ కోర్టును ఆశ్రయించాడు. అడ్డుగా ఉన్న గృహాలు తొలగించాలంటూ కోర్టు స్థానిక అధికారులకు ఉత్తర్వులు ఇచ్చింది. ఈనేపథ్యంలో శుక్రవారం నరసరావుపేట డీఎస్పీ కె.నాగేశ్వరరావు పర్యవేక్షణలో స్థానిక తహసీల్దారు ఎ.బి.సుధాకర్, ఆర్ అండ్ బీ ఏఈ కె.నవ్యలు గ్రామానికి చేరుకుని నివాస గృహాల కూల్చివేతకు సిద్ధమయ్యారు. బాధితుల రోదనల మధ్య ఆక్రమణల తొలగింపు కొంత మేరకు నిర్వహించారు. బాధితుల్లో ఒకరు చుంచునీటి శౌరమ్మ కోర్టు ఉత్తర్వులు నిలిపివేయాలని కోర్టును ఆశ్రయించింది. రోడ్డు సైడు ఖాళీ స్థలంలో ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్నామని బాధితులు తెలిపారు. ఎం.వీరయ్య, హుస్సేన్, కె.గోవిందయ్య, జి.వెంకయ్యలకు చెందిన రేకుల షెడ్డులు, జి.మునయ్య, కె.నాగరాజులకు చెందిన పక్కా భవనాలు తొలగింపు పూర్తవుతున్న సమయంలో కోర్టు నుంచి స్టేటస్ కో ఉత్తర్వులు వెలువడ్డాయని సమాచారం రావడంతో ఆక్రమణల తొలగింపును అధికారులు నిలిపివేశారు. ఈ విషయమై తహసీల్దారును వివరణ కోరగా రహదారులు భవనాల శాఖ నుంచి రోడ్డు ఆక్రమణలకు గురైందని గుర్తించడం జరిగిందని, ఆక్రమణదారులకు ఫారం–7 నోటీసులు అందజేశామని తెలిపారు. పొలం యజమాని నాకు దారి కావాలంటూ కోర్టుకు వెళ్లడంతో మే నెలలో రోడ్డు సైడ్ ఆక్రమణలు తొలగించాలని తమకు ఉత్తర్వులు అందాయన్నారు. అనంతరం బాధితులు కోర్టుకు వెళ్లడంతో ఆక్రమణల తొలగింపు నిలిపివేశామన్నారు.
కోర్టు ఉత్తర్వులు అమలుకు సిద్ధమైన అధికారులు మోహరించిన పోలీసులు మా ఇళ్లు కూల్చవద్దంటూ బాధితుల వేడుకోలు స్టేటస్ కోతో కూల్చివేత నిలిపివేత
అధికారులు కనికరించాలి
ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్నాం. పక్కా గృహం నిర్మించుకున్నాం. ఆక్రమణలంటూ తొలగిస్తే మేము ఎక్కడకు వెళ్లాలి. మాకు వేరే ఇళ్లు లేదని, అధికారులు కనికరించి ఇక్కడే నివాసం ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలి.
– జి.అనంతలక్ష్మి, బాధితురాలు, వెల్లటూరు
పొలానికి దారి కోసం గృహాలు కూల్చివేత
పొలానికి దారి కోసం గృహాలు కూల్చివేత