
ఇంద్రకీలాద్రికి శ్రావణ శోభ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రి శ్రావణ శోభ సంతరించుకుంది. శ్రావణ మాసం తొలి శుక్రవారం ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ కనిపించింది. అమ్మ వారి ప్రధాన ఆలయంతోపాటు అన్ని మార్గాల ను పూలతో అలంకరించారు. అమ్మవారికి నిర్వహించిన పలు అర్జిత సేవలు, ప్రత్యేక కుంకుమార్చనలో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. ఉదయం నుంచి వర్షం కాస్త తెరిపి ఇవ్వడంతో ఇతర ప్రాంతాల నుంచి సైతం భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తెల్లవారుజామున అమ్మవారి ప్రధాన ఆలయంలో నిర్వహించిన ఖడ్గమాలార్చన, లక్ష కుంకుమార్చన, శ్రీచక్ర న వార్చనలో ఉభయదాతలు పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలోని లక్ష కుంకుమార్చన వేదిక వద్ద శ్రావణమాస ప్రత్యేక కుంకుమార్చన నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రత్యేక కుంకుమార్చన జరుగుతుందని ఆల య అర్చకులు పేర్కొన్నారు. ప్రతి గంటకు ఒక బ్యా చ్ చొప్పుల పూజ నిర్వహిస్తామని చెప్పారు. అమ్మ వారి పాత మెట్ల మార్గంలో మెట్ల పూజలను భక్తులు విశేషంగా నిర్వహించారు. కొందరు భక్తులు మోకాళ్లపై మెట్లు ఎక్కుతూ, అమ్మవారి ఆలయ మెట్లుకు పసుపు, కుంకుమ పెట్టి పూజలు నిర్వహించారు.
ఘాట్‌రోడ్డుపై ద్విచక్రవాహనాలకు అనుమతి...
గత రెండు రోజులుగా దుర్గగుడి ఘాట్‌రోడ్డును మూసివేసిన ఆలయ అధికారులు, శుక్రవారం ద్విచక్ర వాహనాలను అనుమతించారు. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఉదయం 11 గంటల నుంచి కొండపైకి ద్విచక్రవాహనాలను అనుమతించారు. కార్లు, దేవస్థాన బస్సులను కనకదుర్గనగర్ వైపు మళ్లించారు.