
జల్సాలకు అలవాటుపడి బైకులు చోరీ
నగరంపాలెం: జల్సాలు చేయడానికి సొమ్ము కోసం ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న తొమ్మిది మంది సభ్యుల ముఠాను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ తెలిపారు. సుమారు రూ.25 లక్షల విలువైన 34బైకులను వారి నుంచి స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. గుంటూరులోని జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్‌లో శుక్రవారం జరిగిన విలేకర్ల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఇటీవల గుంటూరు తూర్పు, పశ్చిమ సబ్ డివిజన్లలోని పట్టాభిపురం, పాత గుంటూరు, నగరంపాలెం, తాడికొండ పీఎస్‌ల పరిధిలో ఎక్కువ గా బైకు చోరీలు జరిగాయని ఫిర్యాదులు రావడంతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు. సీసీ కెమెరాల ఫుటేజీలు, పాత నేరస్తుల కదలికలు, సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి సారించామని చెప్పా రు. అనుమానితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేశామని అన్నారు. ఈ కేసులో ఇద్దరు మైనర్లు (కేవీపీ కాలనీ 4వ వీధి, శ్రీనివాసరావు పేట వాసులు)తోపాటు అక్కిశెట్టి ఆకాష్ (ఎల్‌ఐసీ కాలనీ), ఉప్పు రాకేష్ (స్తంభాలగరువు), మడుగుల రవితేజ (కేవీపీ కాలనీ), షేక్ అషీరు (పిడుగురాళ్ల మండలం గుత్తికొండ గ్రామం), కోన వెంకటగోపీ (లక్ష్మీనగర్ రెండో వీధి), టి.రాజేష్, బోయపాటి జయసాయి (తాడికొండ మండలం మోతడక గ్రామం ఎస్‌టీ కాలనీ)లను అరెస్ట్ చేశామని వివరించారు.
అందరూ 27 ఏళ్లలోపు వారే...
అరెస్ట్ అయిన వారందరూ 27 ఏళ్లలోపు వయస్సు వారే. వీరిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు. రవితేజ, ఆకాష్‌లు చోరీలకు ఆజ్యం పోశారు. వీరంతా ముఠాగా ఏర్పడి కొంతకాలంగా గుంటూరు నగర పరిధిలోని ఇళ్ల ఎదుట, మార్కెట్ ప్రదేశాలు, ఆసుపత్రులు, ప్రార్థన స్థలాల వద్ద నిలిపి ఉంచిన బైకులను దొంగిలించారు. తర్వాత ఆ బైక్‌లను విక్రయించి సొమ్ము చేసుకునేవారు. వీరిలో ఒకరిద్దరు పాత నేరస్తులు ఉన్నారు. బైకులను కొనుగోలు చేసిన వారిని కూడా అరెస్ట్ చేస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. చోదకుల నిర్లక్ష్యం వల్లే వాహన చోరీలు జరగుతున్నాయని అన్నారు. పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. వాహనాలకు హ్యాండిల్ లాక్, వీల్ లాక్‌లను బిగించుకోవాలని చోదకులకు సూచించారు. కేసు దర్యాప్తులో ప్రతిభ చూపిన జిల్లా ఏఎస్పీ కె.సుప్రజ (క్రైం), డీఎస్పీలు శివాజీరాజు (సీసీఎస్), అబ్దుల్ అజీజ్ (తూర్పు), అరవింద్ (పశ్చిమ), సీఐలు, పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.
ఇద్దరు మైనర్లు సహా తొమ్మిది మంది నిందితులు అరెస్ట్ రూ.25 లక్షల ఖరీదైన ద్విచక్ర వాహనాలు స్వాధీనం కేసు వివరాలు వెల్లడించిన గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్