
‘విజయ’ స్ఫూర్తి.. చెరగని కీర్తి
తెనాలి: పాక్‌తో 1999లో కార్గిల్ యుద్ధం అనివార్యమైంది. భారతీయ సేనలు మూడునెలలు భీకర పోరాటం చేసి విజయం సాధించాయి. ఆ యుద్ధంలో ఉమ్మడి తెనాలి డివిజన్ సైనికులు ముగ్గురు వీరమరణం పొందారు. వారి స్ఫూర్తి నేటికీ కొనసాగుతోంది. కార్గిల్ యుద్ధంలో మాతృభూమి రక్షణకు ప్రాణం అర్పించడమే లక్ష్యంగా భారత సైనికులు దూసుకెళ్లారు. శత్రువుకు అవకాశం ఇవ్వకుండా తరిమికొట్టారు. యుద్ధ విజయంలో భారతీయ ఇన్‌ఫాంట్రీ విభాగం సైనికులే నిజమైన హీరోలయ్యారు. నాడు వీరమరణం పొందిన సైనికుల్లో తెనాలి డివిజన్‌కు చెందిన ఎస్‌కే మస్తాన్‌వలి, ఎండీ హాజీబాషా, కేసన శివయ్య ఉన్నారు. నేడు కార్గిల్ దివస్ సందర్భంగా వారి గురించి ప్రత్యేక కథనం ఇది.
యువరక్తం చిందించిన మస్తాన్‌వలి...
ఎస్‌కే మస్తాన్‌వలి స్వస్థలం నిజాంపట్నం. అప్పటికి ఆయన వయస్సు 25 ఏళ్లు. పేద కుటుంబంలో జన్మించారు. చిన్నతనం నుంచి సైనికుడు కావాలన్నదే లక్ష్యం. 1994లో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లో ఎంపికయ్యారు. సైనికుడిగా విధులు నిర్వర్తిస్తూ కార్గిల్ యుద్ధంలో కదం తొక్కారు. మాతృభూమి కోసం అమరడయ్యారు. మస్తాన్‌వలి భౌతికకాయానికి నాడు అధికారిక లాంఛనాలతో జరిగిన అంత్యక్రియలకు నిజాంపట్నంలో జనం పోటెత్తారు. గ్రామస్తులతోపాటు ఎందరో పుష్పాంజలి ఘటించారు. ఆయన గుర్తుగా స్మారకస్తూపాన్ని నిర్మించారు. ఆయన తండ్రి బాక్సి నిజాంపట్నంలోని మస్తాన్ వలి సమాధి చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించారు. మస్తాన్‌వలి పేరుతో ముఖద్వారాన్ని ఏర్పాటు చేశారు.
పెద్దలు స్ఫూర్తిగా హాజీబాషా...
చందోలు గ్రామంలో 1973లో అబ్దుల్ రెహ్మాన్, ముంతాజ్‌బేగం దంపతులకు జన్మించారు హాజీబాషా. హాజీబాషా తండ్రి రెహ్మాన్, తాత షేక్ మస్తాన్‌లు కూడా సైన్యంలో పనిచేసిన వారే. తమ పెద్దల స్ఫూర్తితో 20 ఏళ్ల వయసులోనే అంటే 1993లో సైన్యంలో చేరారు. 110 ఇంజినీర్ రెజిమెంట్ ముంబయి ఇంజినీరింగ్ గ్రూపులో 17వ బెటాలియన్ గార్విల్ రైఫిల్స్‌లో పనిచేశారు. ‘ఆపరేషన్ విజయ్’లో వీరమరణం పొందారు. కుమారుడి మరణంతో ఆయన తండ్రి రెహ్మాన్ దిగులుపడి తర్వాతి ఏడాదిలోనే కన్నుమూశారు. హాజీబాషా తమ్ముడు కూడా ఎనిమిదేళ్ల వయసులో మెదడువాపుతో చనిపోయారు.
శివయ్య త్యాగం చిరస్మరణీయం
చేబ్రోలు మండల గ్రామం శేకూరులో వ్యవసాయ కూలి దంపతులు సాంబయ్య, వెంకటేశ్వరమ్మ దంపతుల కుమారుడు కేసన శివయ్య. గ్రామం నుంచి పలువురు సైన్యంలో చేరటంతో వారి స్ఫూర్తితో తానూ సైనికుడు కావాలని శివయ్య భావించారు. పదో తరగతితోనే చదువు ఆపేశారు. 1989–90లో ఆర్మీకి ఎంపికయ్యారు. రైఫిల్స్ విభాగంలో పనిచేస్తూ కార్గిల్ యుద్ధంలో పాలుపంచుకున్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన తమ కుమారుడు స్ఫూర్తిగా నిలవాలనే భావనతో ఆయన విగ్రహాన్ని శేకూరులో కుటుంబసభ్యులు ఏర్పాటు చేశారు. ఆ విగ్రహాన్ని చూసినపుడల్లా శివయ్య త్యాగం తమకు స్ఫూర్తిగా నిలుస్తుందని గ్రామస్తులు చెప్పారు.
కార్గిల్ యుద్ధంలో తెనాలి ప్రాంత వాసులు ముగ్గురు వీరమరణం
నేడు కార్గిల్ విజయ దివస్ సందర్భంగా వారి సేవలు స్మరణీయం

‘విజయ’ స్ఫూర్తి.. చెరగని కీర్తి

‘విజయ’ స్ఫూర్తి.. చెరగని కీర్తి

‘విజయ’ స్ఫూర్తి.. చెరగని కీర్తి

‘విజయ’ స్ఫూర్తి.. చెరగని కీర్తి