
కార్మికులు సమ్మెలో .. చెత్త వీధుల్లో..!
సత్తెనపల్లి: పట్టణంలో ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన కొరవడింది. పారిశుధ్య, ఇంజనీరింగ్ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మెలోకి వెళ్లడంతో ఎక్కడి సమస్యలు అక్కడే తిష్ట వేశాయి. ప్రధానంగా పట్టణంలో పారిశుధ్యం దారుణంగా తయారైంది. పారిశుధ్య విభాగంలో 23 మంది పర్మినెంట్ వర్కర్లు, 136 మంది ఔట్‌సోర్సింగ్ కార్మికులు, ఇంజనీరింగ్ విభాగంలో 53 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. ఒక్కసారిగా వీరంతా సమ్మెలోకి వెళ్లడంతో కేవలం పారిశుధ్య విభాగంలోని 23 మంది పర్మినెంట్ వర్కర్లలో 17 మంది మాత్రమే విధులకు హజరై సేవలందిస్తున్నారు. దీంతో దుకాణాల ముందు, కాలువల్లో పేరుకు పోయిన చెత్తను తొలగించడం పెద్ద ప్రహసనంలా మారింది. ఇదిలా ఉంటే ఇంటింటి చెత్త సేకరణ పూర్తిగా నిలిచిపోయింది. పట్టణంలో ఎక్కడ చూసినా చెత్త కుప్పలు దర్శన మిస్తున్నాయి. గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం ఉదయం వరకు వర్షం కురవడంతో వీధుల్లో చెత్త రోడ్ల మీదకు చేరి కంపు కొడుతుంది. మరో వైపు కుళాయిల ద్వారా సరఫరా చేసే నీరు రంగు మారి దుర్వాసన వస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికై నా కార్మికుల సమస్యల పరిష్కారానికి పాలకులు చర్యలు తీసుకొని పుర ప్రజలకు సేవలు అందించేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

కార్మికులు సమ్మెలో .. చెత్త వీధుల్లో..!

కార్మికులు సమ్మెలో .. చెత్త వీధుల్లో..!