
సోమవారం శ్రీ 14 శ్రీ జూలై శ్రీ 2025
నరసరావుపేట టౌన్: విలువైన ప్రభుత్వ భూములను స్వప్రయోజనాల కోసం టీడీపీ వినియోగించేందుకు ప్రయత్నిస్తున్న తీరుపై విమర్శలు వస్తున్నాయి. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట నడి బొడ్డున రెవెన్యూ శాఖకు చెందిన సుమారు 60 సెంట్ల స్థలం ఉంది. ఇక్కడ టీడీపీ నియోజకవర్గ కార్యాలయం నిర్మించేందుకు పావులు కదుపుతున్నారు. జిల్లా పార్టీ కార్యాలయం కోసం చిలకలూరిపేట రోడ్డులోని టిడ్కో గృహాల సమీపంలో మరో ఎకరం కేటాయింపునకూ రంగం సిద్ధం చేశారు. ఈ భూముల విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.25 కోట్లపైగా ఉంది. మొదట గుంటగార్లపాడు పరిధిలోని బరంపేట మినీ బైపాస్‌లో గల శిశు సంక్షేమ కార్యాలయం పక్కన భూమిని జిల్లా పార్టీ కార్యాలయం కోసం పరిశీలించారు. వాగు పోరంబోకు పరిధిలో ఉండటం, దానికి తోడు కోర్టు వివాదాల కారణంగా ప్రయత్నాన్ని విరమించుకున్నారు.
వెనక్కు తీసుకున్న భూమిపై కన్ను...
పాత పల్నాడు బస్టాండ్ సమీపంలోని అన్న క్యాంటీన్ వెనుక ఉన్న రెవెన్యూ శాఖకు చెందిన భూమి గతంలో ప్రజల అవసరార్థం ఆర్టీసీకి అప్పగించారు. ఆర్టీసీ సేవలు తొలగించడంతో స్థలం వినియోగంలో లేకుండా పోయింది. భూమిని తిరిగి రెవెన్యూ శాఖ స్వాధీనం చేసుకుంది. ఆ స్థలాన్ని టీడీపీ నియోజకవర్గ కార్యాలయంగా మార్చాలని నేతలు ప్రయత్నిస్తున్నారు. కలెక్టర్‌పై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. అక్కడ సాధ్యం కాకపోతే కలెక్టర్ బంగ్లా వెనుక ప్రాంతంలో ఉన్న సుమారు 35 సెంట్ల భూమిని కేటాయించాలని ఒత్తిడి తెస్తున్నారు. జిల్లా టీడీపీ కార్యాలయం కోసం టిడ్కో గృహ సముదాయం సమీపంలోని విలువైన ఎకరం భూమి కేటాయించాలని అధికారులపై ఒత్తిడి పెంచారు. ప్రతిపాదనలు సిద్ధం చేసి ఇప్పటికే పంపినట్టు రెవెన్యూ వర్గాల ద్వారా తెలిసింది.
చిలకలూరిపేటలోనూ ఇదే కథ...
టీడీపీ ప్రభుత్వ హయాంలో అధికార దుర్వినియోగం ఇదే తొలిసారి కాదు. చిలకలూరిపేటలోనూ రూ.కోట్ల విలువ చేసే భూమిని గత టీడీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక పార్టీ కార్యాలయం కోసం కేటాయించారు. విశ్రాంత ఉద్యోగులు నివసిస్తున్న ఆ స్థలాన్ని బలవంతంగా ఖాళీ చేయించారు. 33 ఏళ్ల లీజు ప్రతిపాదికన నామమాత్రపు అద్దెకు ఒప్పించుకొని విలువైన భూమిని పార్టీ కార్యాలయంగా మలిచారు. అప్పట్లో జరిగిన ఈ అక్రమ పనిపై విమర్శలు వెల్లువెత్తాయి.
న్యూస్‌రీల్
అద్దె భవనాల్లోనే ప్రభుత్వ కార్యాలయాలు
నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లా ఏర్పాటు అయిన తర్వాత అనేక జిల్లా స్థాయి కార్యాలయాలు నరసరావుపేటకు తరలి వచ్చాయి. అవన్నీ తాత్కాలిక అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. సొంత భవనాలు లేకపోవడంతోపాటు అధికారులు నివాసం ఉండేందుకు వసతి గృహాలు కూడా లేవు. దీంతో ప్రతి నెలా ప్రభుత్వ ఖజానాపై రూ.లక్షల అద్దె భారం పడుతోంది. ఈ పరిస్థితిలో నరసరావుపేటలో విలువైన భూములను తెలుగుదేశం పార్టీ కార్యాలయాలకు కట్టబెట్టడం ఎంత వరకు సమంజసం అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ భూములను ప్రజావసరాల కోసం వినియోగిస్తే, ప్రభుత్వ సేవలు మరింత సమర్థంగా అందే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పాలనలో పారదర్శకత, ప్రజా ప్రయోజనాలకు ఇచ్చే ప్రాధాన్యత ఎంతనేది ఈ నిర్ణయమే తేల్చనుంది.
రూ. కోట్ల విలువ చేసే భూములపై టీడీపీ కన్ను
పార్టీ కార్యాలయాల
పేరిట కాజేసే ప్రయత్నం
ప్రభుత్వ స్థలాలను కారుచౌకగా
కొట్టేసేందుకు కుట్ర
టీడీపీ అధిష్టానం నుంచి
అధికారులపై తీవ్ర ఒత్తిడి
ప్రభుత్వ కార్యాలయాలకు మాత్రం
సొంత భవనాల్లేని దుస్థితి
పాలకుల తీరుపై నరసరావుపేట
ప్రజల ఆగ్రహం
ప్రజలకు మేలు చేసే పనుల కంటే పార్టీ ఖాతాలో ప్రభుత్వ ఆస్తులను చేర్చడమే టీడీపీకి ప్రధానమైపోయింది. ఒక వైపు సర్కారు కార్యాలయాలకు సొంత భవనాలు లేక రూ.లక్షల అద్దె చెల్లిస్తున్న దుస్థితి. మరోవైపు పార్టీ కార్యాలయాలకు ప్రభుత్వ భూమి కేటాయించాలని అధికారులపై టీడీపీ నేతల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. రూ.కోట్ల విలువైన భూములను ఇలా చౌకగా కొట్టేసేందుకు జరుగుతున్న కుట్రపై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు.

సోమవారం శ్రీ 14 శ్రీ జూలై శ్రీ 2025

సోమవారం శ్రీ 14 శ్రీ జూలై శ్రీ 2025