
పోక్సో కేసు రాజీ కోసం పోలీసుల వేధింపులు
● మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి, బాధిత కుటుంబ సభ్యుల ఆగ్రహం ● చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి వినతి
నరసరావుపేట: ఓ బాలికను వేధించిన యువకుడిపై పోక్సో కేసు పెట్టిన తల్లిదండ్రులను రాజీ కోసం కొట్టి హింసించి వేధిస్తున్న నరసరావుపేట రూరల్ పోలీసులపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్)లో బాధిత కుటుంబ సభ్యులతో కలిసి అదనపు ఎస్పీ జేవీ సంతోష్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. నాదెండ్ల గొరిజవోలుకు చెందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన కొండెబోయిన శ్రీనివాసరావు నరసరావుపేట మండలంలోని దొండపాడులో ఓ యువతి వివాహం చేసుకున్నాడని, వారికి 17ఏళ్ల మైనర్ బాలిక ఉందని తెలిపారు. గ్రామానికి చెందిన ఓ యువకుడు ఆమెను ప్రతిరోజు వెంటపడుతూ వేధిస్తున్నాడని చెప్పారు. దీంతో ఆ బాలికను అమ్మమ్మ ఊరు దొండపాడులో ఉంచారని వివరించారు. యువకుడు ఈ విషయం తెలుసుకొని దొండపాడు వచ్చి వెళుతుండటంతో ఆ బాలిక సోదరుడు, గ్రామస్తులు కలిసి మందలించి పంపించారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆ మైనర్ బాలిక మానసికంగా కుంగిపోయి పురుగుమందు తాగగా ప్రభుత్వాసుపత్రిలో చేర్చారని తెలిపారు. చికిత్స పొందుతున్న సమయంలో పోలీసులు బాలిక నుంచి రిపోర్టు తీసుకొని ఆ యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశారని గోపిరెడ్డి చెప్పారు. ఆ బాలిక 11రోజులపాటు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి చేరుకుందన్నారు. అయితే, ఆ కేసును తప్పించుకునేందుకు రాజీ కోసం తల్లితండ్రులు కుమారుడు అదృశ్యమయ్యాడనే ఫిర్యాదును నరసరావుపేట రూరల్ పోలీసులకు ఇచ్చారని చెప్పారు. కేసులో తప్పకుండా శిక్ష పడుతుందనే ఉద్దేశంతో నెలరోజుల నుంచి బాలిక తల్లితండ్రులు, సోదరుడితో పాటు గ్రామస్తులను పోలీసుస్టేషన్‌కు పిలిపించి వేధించటం ప్రారంభించారని గోపిరెడ్డి ఆరోపించారు. బాలిక సోదరుడిని పోలీసుస్టేషన్‌కు పిలిచి కొట్టారన్నారు. శరీరంపై పడిన దెబ్బల మచ్చలను మీడియాకు చూపించారు. పోలీసులు ఈ విధంగా వ్యవహరించటం దారుణమని ఆయన ఖండించారు. బెంగుళూరు, తిరుపతి ప్రదేశాల్లో ఆ యువకుడిని దాచిపెట్టి రాజీకోసం ఈవిధంగా తప్పుడు కేసులు పెట్టి బాధిత కుటుంబాన్ని వేధించటం రెడ్‌బుక్ రాజ్యాంగానికి పరాకాష్ట అని గోపిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు పక్షాన నిలబడాల్సిన పోలీసులు ఒక్కపార్టీ వైపే ఉండటం చాలా దారుణమని ఆయన విమర్శించారు. ఎస్పీ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. బాధిత కుటుంబం సభ్యుడైన శ్రీనివాసరావు మీడియాతో జరిగిన విషయం చెప్పారు. కార్యక్రమంలో దొండపాడు గ్రామ సర్పంచ్ జక్కిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, బాధిత బాలిక కుటుంబ సభ్యులు, వైఎస్సార్ సీపీ నాయకులు ఈఎం. స్వామి, షేక్ కరిముల్లా, సుబ్రహ్మణ్యం నాయీ పాల్గొన్నారు.