
కార్మికుల న్యాయబద్ధమైన కోరికలు నెరవేర్చాలి
పిడుగురాళ్ల: రాష్ట్రంలోని మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల న్యాయబద్ధమైన కోరికలను వెంటనే ప్రభుత్వం నెరవేర్చాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర వైద్యుల విభాగం అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్‌కుమార్ అన్నారు. పట్టణంలోని ఐలాండ్ సెంటర్‌లో గత రెండు రోజుల నుంచి మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు నిరవధిక సమ్మెకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత మూడు రోజులుగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఇదిసరైన పద్ధతి కాదన్నారు. మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు గొంతెమ్మ కోర్కెలు ఏమీ కోరడం లేదని, కార్మికుల కుటుంబాలను పస్తుల నుంచి కాపాడుకోవడానికి ఈ సమ్మె చేస్తున్నారన్నారు. జీఓ నెంబర్ 36 ప్రకారం వారి జీతాలు పెంచాలని, కార్మికులందరికీ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా త్వరలోనే మున్సిపల్ కార్మికులు కూడా సమ్మె బాట పట్టబోతున్నారని, వారు సమ్మె చేస్తే రాష్ట్రంలో ఎక్కడ వేసిన చెత్త అక్కడే ఉండే పరిస్థితి ఉంటుందని కావున ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ చింతా సుబ్బారెడ్డి, మాజీ ఎంపీపీ అల్లు పిచ్చిరెడ్డి, కౌన్సిలర్లు వాసుదేవరెడ్డి, పార్టీ గురజాల మున్సిపాలిటీ కన్వీనర్ జూలకంటి శ్రీనివాసరావు, పల్నాడు జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షుడు సయ్యద్ జబీర్, సీఐటీయూ మండల కార్యదర్శి తెలగపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ రాష్ట్ర వైద్యుల విభాగం అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్‌కుమార్