
లాడ్జిలో అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
పిడుగురాళ్ల: పట్టణ సమీపంలోని కొండమోడు వద్ద గల ఆర్‌ఆర్ లాడ్జిలో అనుమానాస్పదస్థితిలో శుక్రవారం వ్యక్తి మృతి చెందాడు. పట్టణ ఎస్‌ఐ శివనాగరాజు తెలిపిన వివరాల మేరకు..చిన్నగార్లపాడు గ్రామస్తులు చింతలచెరువు వీరాంజనేయరెడ్డి(38), లారీ డ్రైవర్ షేక్ కిరణ్ కలిసి గురువారం రాత్రి లాడ్జిలో రూం తీసుకుని మద్యం తాగారు. తెల్లవారుజామున షేక్ కిరణ్ డ్యూటీ ఉందని వెళుతూ వీరాంజనేయరెడ్డిని నిద్ర లేపాడు. అయినా లేకపోవడంతో మంచి నిద్రలో ఉన్నాడని అనుకొని వెళ్లిపోయాడు. ఆ తర్వాత బాయ్ వచ్చి చూసేసరికి వీరాంజనేయరెడ్డి చనిపోయి ఉన్నాడు. లాడ్జీ యాజమాన్యం ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి పట్టణ సీఐ శ్రీరాం వెంకట్రావు, సిబ్బంది చేరుకున్నారు. మృతుడు ఏడు నెలల కిందట చినగార్లపాడు నుంచి పిడుగురాళ్ల పట్టణానికి వచ్చి ఉంటున్నాడు. కొంత కాలం కిందట గుండెపోటు రావడంతో ఆయనకు బైపాస్ సర్జరీ జరిగింది. మృతుని బంధువుల దిన కార్యక్రమానికి హాజరై, భోజనాన్ని క్యారేజీలో తీసుకొని రూంలోకి తీసుకెళ్లి తిన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ వీరాంజనేయరెడ్డి మృతి చెందాడు. ఆయనకు భార్యతోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శివనాగరాజు తెలిపారు. బంధువులు అనుమానాస్పద మృతిగా భావిస్తున్నారు.