
వాటర్ గ్రిడ్ స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్
విజయపురి సౌత్: మేకల గొంది నుంచి జలజీవన్ మిషన్ ద్వారా రూ.1200 కోట్లతో మాచర్ల నియోజకవర్గంతో పాటు పల్నాడు ప్రాంతానికి తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం సంకల్పించిన నేపథ్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం సంబంధిత స్థలాన్ని అధికారులు పరిశీలించారు. మేకల గొందిలో వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసే స్థలంలో సర్వే మ్యాపులను పరిశీలించారు.అన్ని అనుమతులు మంజూరయితే నిర్మాణానికి ముహూర్తం ఖరారు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో గురజాల ఆర్డీఓ వి.మురళీకృష్ణ, డీఎఫ్‌ఓ సందీప్ కుమార్, మాచర్ల తహసీల్దార్ కిరణ్ కుమార్, ఇరిగేషన్ ఈఈ రమేష్ పాల్గొన్నారు.
చౌడేశ్వరి అమ్మవారికి
పుట్టింటి చీరసారె సమర్పణ
రెంటచింతల: స్థానిక చౌడేశ్వరీ అమ్మవారికి శుక్రవారం ఆషాఢ మాస పుట్టింటి చీరసారెను సమర్పించగా ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రధాన అర్చకులు పి.అనీల్‌కుమార్‌శర్మ నేతృత్వంలో అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దేవస్థానం పెద్దశెట్టి పల్లా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో స్థానిక శ్రీ రాములవారి ఆలయం వద్ద నుంచి మేళతాళాలతో ఆషాఢ మాస పుట్టింటి చీరసారెను భక్తులతో కలిసి తీసుకువచ్చి, అమ్మ వారికి సమర్పించారు.
‘స్వచ్ఛ’ అవార్డు రావడం
అభినందనీయం
నెహ్రూనగర్/గుంటూరు వెస్ట్: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో గుంటూరు జిల్లాకు అవార్డు రావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ప్రశంసించారు. అవార్డును జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు, అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు శుక్రవారం క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌కు చూపారు. ఇది సమష్టి కృషి ఫలితమని ఆమె పేర్కొన్నారు.కేంద్రం నుంచి ‘సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీస్ 2024–25’ పోటీల్లో గుంటూరుకు లభించిన అవార్డు నగర ప్రజలు, ప్రజారోగ్య కార్మికులకు అంకితమని మేయర్ కోవెలమూడి రవీంద్ర చెప్పారు. శుక్రవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఆయన అధికారులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. అవార్డు అందిన స్ఫూర్తితో సమగ్రాభివృద్ధి సాధిస్తామని తెలిపారు. కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ అందరి కృషితోనే గుర్తింపు లభించిందన్నారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, డిప్యూటీ కమిషనర్లు, విభాగాధిపతులు పాల్గొన్నారు.
ముగిసిన పవిత్రోత్సవాలు
పెదకాకాని: శివాలయంలో మూడు రోజులపాటు జరిగిన పవిత్రోత్సవాలు శుక్రవారం శాస్త్రోక్తంగా ముగిశాయి. పెదకాకాని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో వేడుకల చివరి రోజైన శుక్రవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్ పర్యవేక్షణలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాగా, 20వ తేదీన శ్రీ భ్రమరాంబ అమ్మవారిని శాకంబరీదేవిగా అలంకరించి విశేష పూజలు చేయనున్నారు. స్థానాచార్యులు పొత్తూరి సాంబశివరావు, ప్రధాన అర్చకులు పొత్తూరి లక్ష్మీనారాయణ వరప్రసాద్, దాతలు నేలవెల్లి కోటేశ్వరి, కర్నే శివ సందీప్ నాగశిరీష, రెడ్డి నవీన్ కుమార్ విజయలక్ష్మీ, నేలివెల్లి నాగప్రత్యూష, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.

వాటర్ గ్రిడ్ స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్