
పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య
పెదకూరపాడు: క్షణికావేశానికి లోనై యువతీ, యువకులు నిండు నూరేళ్ల జీవితాన్ని మధ్యలోనే ముగిస్తున్నారు. పురుగు మందు తాగి బాలిక మృతి చెందిన ఘటన మండలంలోని కన్నెగండ్లలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన గోగులపాటి బ్రహ్మనాయుడు, పిచ్చమ్మలకు ముగ్గురు సంతానం. పెద్ద కుమార్తె తులసి(17) గత ఏడాది పెదకూరపాడు జెడ్పీ హైస్కూలులో పదో తరగతి పూర్తిచేసింది. ఈ క్రమంలో గురువారం ఉదయం తల్లి పిచ్చమ్మ ఉపాధి పనులకు, తండ్రి బ్రహ్మనాయుడు బంధువుల ఇంటికి వెళ్లారు. ఈ సమయంలో ఇంట్లో ఉన్న గడ్డి మందును తులసి తాగింది. చెల్లి గమనించి బిగ్గరగా కేకలు వేయగా, చుట్టపక్కల వారు వచ్చి తొలుత సత్తెనపల్లి ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమించడంతో గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున తులసి మృతి చెందింది. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తల్లిదండ్రులు ఆమె చదువును ఆపేయించారు. దీంతో మనస్తాపం చెందిన పురుగు మందు తాగినట్లు తెలుస్తోంది. పెద్దకుమార్తె మృతితో బ్రహ్మనాయుడు కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.