
గ్రామసభల ద్వారా పేర్లు తొలగిస్తాం
నూజెండ్ల: ‘మార్గదర్శి–బంగారు కుటుంబం’ లబ్ధిదారుల జాబితాలో పేర్లు విస్తుగొలుపుతున్నాయి. పేదల స్థానంలో ఆర్థికంగా ఉన్నతస్థితిలో ఉన్న వారి పేర్లు ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వివరాలు మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ప్రదర్శనకు ఉంచారు.
తొలి దశలో 2,288 మంది ఎంపిక
పేదరిక నిర్మూలనలో భాగంగా వెనుకబడిన కుటుంబాలను గుర్తించి వారిని అభివృద్ధి పథంలో నడపటానికి ప్రభుత్వం పి–4 సర్వే చేపట్టింది. ప్రతి గ్రామంలో సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వివరాలు నమోదు చేశారు. దీని ఆధారంగా నూజెండ్ల మండలంలో 16 సచివాలయాల పరిధిలో 2,288 మందిని అధికారులు ఎంపిక చేశారు. వీరికి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టనర్‌షిప్ (పి–4) విధానంలో ఆర్థిక చేయూతనందించి పేదరిక నిర్మూలన సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
నిబంధనలకు పాతర
పి–4 సర్వేలో లబ్ధిదారులను స్థితిగతుల ఆధారంగా ఎంపిక చేయాలి. సొంతిల్లు, పొలం, ద్విచక్ర వాహనంతో పాటు కుటుంబ సభ్యులు ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారా ? తదితర అంశాలు పరిగణలోకి తీసుకోవాలి. అయితే లబ్ధిదారుల జాబితా పరిశీలిస్తే ఈ అంశాలేవీ కన్పించడం లేదు. నూజెండ్ల గ్రామంలో 51 మందిని ఎంపిక చేసిన విధానం చూస్తే చాలా లోపాలు ఉన్నాయి. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తుడైన మల్లంపాటి నాగార్జునరెడ్డి (31), కస్తూరిబా పాఠశాలలో ప్రభుత్వ ఉద్యోగస్తురాలి కూతురు గుడివాడ దీప్షిక (14) ఎంపిక కావడం సర్వే లోపాలను బహిర్గతం చేస్తోంది. గ్రామానికి చెందిన 20 ఎకరాలున్న ఓ భూస్వామి భార్య పేరు, గ్రామ సెంటర్‌లో కోట్ల రూపాయల విలువైన కాంప్లెక్సు, భూములు కలిగిన సీనియర్ సిటిజన్ మహిళ పేరు లబ్ధిదారుల జాబితాలో చేర్చడం విశేషం. అంతేగాక వివాహం జరిగి ఉద్యోగస్తుడైన భర్తతో కాపురానికి వెళ్లిన మహిళల పేర్లు సర్వేలో ఉన్నాయి.
ఓ లబ్ధిదారుకు చెందిన షాపింగ్ కాంప్లెక్సు
విస్తుగొలుపుతున్న
బంగారు కుటుంబం జాబితా
లబ్ధిదారుడిగా హైదరాబాద్‌లో
ఉద్యోగం చేస్తున్న యువకుడు
జాబితాలో ప్రభుత్వ
ఉద్యోగిని కుమార్తె
తూతూమంత్రంగా
గ్రామాల్లో పి–4 సర్వే
బంగారు కుటుంబాల జాబితాలో అనర్హుల పేర్లు ఉంటే తొలగిస్తాం. ప్రతి సచివాలయ పరిధిలో గ్రామసభలు నిర్వహిస్తున్నాం. వీటిలో నిర్ధారణ తర్వాత నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేస్తాం.
–పి.ఉమాదేవి, ఎంపీడీఓ

గ్రామసభల ద్వారా పేర్లు తొలగిస్తాం