
సృజనకు స్వాగతం
ఇన్‌స్పైర్ మనాక్‌కు వేళాయె
సత్తెనపల్లి: విద్యార్థుల్లో శాసీ్త్రయ ఆలోచనలతో పాటు సృజనాత్మకత పెంపొందించి భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ ఇన్‌స్పైర్ మనాక్ అవార్డులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 6 నుంచి 10వ తరగతి వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు అర్హులు. సమాజానికి ఉపయోగపడే సరికొత్త ప్రాజెక్టులతో సంబంధిత వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. ఇన్‌స్పైర్‌లో విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు కూడా పాల్గొనవచ్చు. ప్రతి తరగతి నుంచి ఒకరు చొప్పున ప్రాథమిక ఉన్నత పాఠశాలకు మూడు, ఉన్నత పాఠశాలలకు ఐదు ప్రాజెక్టులు నమోదు చేసుకునే అవకాశం ఉంది. సెప్టెంబర్ 15లోగా నామినేషన్‌కు అవకాశం కల్పించారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇలా ...
ఇన్‌స్పైర్ మనాక్ అవార్డులు పొందేందుకు ఆసక్తి ఉన్నవారు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇన్‌స్పైర్‌అవార్డ్స్‌డిస్ట్ డాట్ గౌ డాట్ ఇన్ (www.inr pireawardrdrt.gov.in) వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేయాలి. మొదట పాఠశాల అథారిటీ ఐకాన్ని క్లిక్ చేసి వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ చేయాలి. పాఠశాల వివరాలన్నీ పొందుపర్చాలి. జిల్లా విద్యాశాఖ నుంచి ఆమోదం వచ్చిన తర్వాత ఈ మెయిల్, యూజ్ ఐడీతో లింక్ వస్తుంది. అందులో పాస్‌వర్డు ఏర్పాటు చేయాలి. తర్వాత నమూనా ప్రాజెక్టు పూర్తి వివరాలు పొందుపరచాలి.
ప్రోత్సాహకాలివి...
ఇన్‌స్పైర్ మనాక్ వెబ్‌సైట్‌లో నమోదు చేసిన ప్రాజెక్టుల్లో ఉత్తమ ఆలోచనల్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి అవార్డులకు ఎంపిక చేస్తుంది. ఇలా జిల్లా స్థాయి ప్రదర్శనకు ఎంపికై న ప్రాజెక్టుకు రూ.10 వేలు నగదు ప్రోత్సాహం అందిస్తారు. రాష్ట్ర స్థాయిలో పాల్గొని జాతీయస్థాయిలో ఎంపికై న బాల శాస్త్రవేత్తలకు రూ.25 వేల నుంచి రూ.40 వేల వరకు అందజేస్తుంది. జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రాష్ట్రపతి భవన్ చుట్టుపక్కల ప్రాంతాల సందర్శనతో పాటు జపాన్ పర్యటనకు అవకాశం కల్పిస్తారు.
అంతా సత్తా చాటేలా...
ఇన్‌స్పైర్ మనాక్ అవార్డుల ప్రదానోత్సవంలో జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబరుస్తున్నారు. 2022–23లో జిల్లా స్థాయిలో 126 ప్రాజెక్టులు ప్రదర్శనకు వచ్చాయి. వాటిలో 13 రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కాగా అందులో రెండు జాతీయ స్థాయి పోటీలకు (క్రోసూరు జై భారత్ పబ్లిక్‌స్కూల్, యడ్లపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల)ఎంపిక కావడం విశేషం. 2023–24, 2024–25 పోటీలు జరగలేదు. ఈ ఏడాది జరిగే ఇన్‌స్పైర్‌కు జిల్లా నుంచి జాతీయ స్థాయిలో పోటీ పడేందుకు బాల శాస్త్రవేత్తలు సిద్ధపడుతున్నారు. ఇన్‌స్పైర్ మనాక్‌లో డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, స్వచ్ఛ భారత్, మేకిన్ ఇండియా, సమాజాభివృద్ధి, క్లీన్‌ఇండియా అంశాల ఆధారంగా ప్రాజెక్టులు తయారు చేయాలి.
నామినేషన్ల స్వీకరణ మొదలు
సెప్టెంబర్ 15 వరకు గడువు
2022–23లో జిల్లా స్థాయిలో 126 ప్రాజెక్ట్‌లు
జాతీయ స్థాయికి చేరేలా ప్రోత్సహించాలి ...
ఇన్‌స్పైర్ మనాక్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ప్రతి ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి భాగస్వామ్యం ఉండేలా చూస్తాం. సాధ్యమైనంత ఎక్కువ మంది ఇందులో పాల్గొని ప్రాజెక్టులు తయారు చేయాలని పాఠశాలల హెచ్‌ఎంలకు తెలియజేస్తున్నాం. ఈ మేరకు లక్ష్యాలను చేరుకునేలా విద్యార్థులను ప్రోత్సహించాలి.
– ఎస్.రాజశేఖర్,
జిల్లా సైన్స్ అధికారి, పల్నాడు

సృజనకు స్వాగతం