
కన్న కొడుకునే కడతేర్చాడు
● ముక్కలుగా నరికి, పూడ్చిపెట్టిన వైనం ● కుమారుడి అదృశ్యంపై మృతుడి పిన్ని ఫిర్యాదుతో వెలుగులోకి ఘటన ● విచారణలో మరిన్ని విస్తుపోయే వాస్తవాలు ● 2014లో తల్లిని, తండ్రిని చంపిన దుర్మార్గుడు ● విషయం తెలిసి తీవ్ర కోపోద్రిక్తులైన క్రోసూరు మండలం యర్రబాలెం గ్రామస్తులు
క్రోసూరు: తాను సొంతంగా జీవించేందుకు, మేపుకొనేందుకు జీవాల్లో వాటా అడిగిన కుమారుడిని కన్న తండ్రే కడతేర్చిన హృదయ విదారక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. అచ్చంపేట మండలం పుట్లగూడెం గ్రామానికి చెందిన బూక్యా వెంకటేశ్వర్లు నాయక్, కుమారుడు మంగ్యానాయక్(19)లు జీవాలు మేపుతూ జీవనం సాగిస్తుంటారు. ఈక్రమంలో మూడు నెలల క్రితం క్రోసూరు మండలంలోని యర్రబాలెం గ్రామానికి జీవాలు మేపుకొంటూ వలస వచ్చారు. అయితే ఈనెల 3వ తేదీ నుంచి తమ కుమారుడు కనిపించడం లేదని నిందితుడి రెండో భార్య, మృతుడి పిన్ని ప్రమీలాభాయి ఈనెల 12వ తేదీన క్రోసూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన భర్తపైనే అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా.. తన కుమారుడిని తానే చంపినట్లు వెంకటేశ్వర్లు నాయక్ అంగీకరించాడు. ఈనెల 3వ తేదీ రాత్రి జీవాల్లో వాటా అడిగినందుకు కొట్టి చంపి, ముక్కలు చేసి, పూడ్చిపెట్టినట్లు ఒప్పుకొన్నాడు. మృతదేహం పూడ్చిపెట్టిన ప్రదేశాన్ని పోలీసులకు చూపించాడు.
కోపోద్రిక్తులైన స్థానికులు
సీఐ పి.సురేష్, తహసీల్దార్ వీవీ నాగరాజు సమక్షంలో మంగ్యానాయక్ మృతదేహాన్ని పంచానామా చేసేందుకు వెలికి తీశారు. అన్నెంపున్నెం ఎరుగని కుమారుడిని చంపడంపై క్రోపోద్రిక్తులైన స్థానిక ప్రజలు, పుట్లగూడెం నుంచి వచ్చిన బంధువులు నిందితుడ్ని వదిలిపెట్టకూడదని తమకు అప్పగిస్తే తామే శిక్ష వేస్తామని నిందితుడిని పోలీసుల దగర్గనుంచి లాక్కునే యత్నం చేశారు. ఈక్రమంలో పోలీసులు లాఠీచార్జి చేసి ప్రజల్ని తరిమివేసి నిందితుడిని పోలీసుస్టేషన్ తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.
జీవాల్లో వాటా అడిగినందుకు కొడుకును చంపిన తండ్రి
కన్న తల్లిదండ్రులను చంపిన కసాయి
విచారిస్తున్న క్రమంలో క్రోసూరు పోలీసులకు మరిన్ని విస్తుపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి. వెంకటేశ్వర్లు నాయక్ క్రూర నేర చరిత్ర బయల్పడింది. 2014 సంవత్సరంలో తన సొంత తల్లిని అడవిలో నరికి చంపిన కేసులో ప్రస్తుతం బెయిల్ పై ఉన్నాడని తేలింది. అనంతరం తన తండ్రిని సైతం హతమార్చడని, కొన్నాళ్లు జైలు జీవితం గడిపాడని.. తన 3 నెలల కుమారుడిని సైతం చంపివేసిన కేసులో కూడా ఉన్నప్పటికీ సాక్ష్యాలు బలంగా లేని కారణంగా ఆ కేసు నిలవలేదని నిందితుడి మొదటిభార్య, మృతుడి తల్లి కోటేశ్వరీభాయి, గ్రామస్తులు సంఘటనా స్థలంలో మీడియాకు వివరించారు. అచ్చంపేట సీఐ పి.శ్రీనివాసరావు, ఎస్‌ఐ రవిబాబు కేసును విచారిస్తున్నారు.

కన్న కొడుకునే కడతేర్చాడు

కన్న కొడుకునే కడతేర్చాడు