సత్తెనపల్లి: నియోజకవర్గంలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. తొలుత ఈదురు గాలులు, ఉరుములతో ప్రారంభమై, ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. పలు గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో వర్షపు నీరు ఇళ్లలోకి చేరి, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సత్తెనపల్లి మండలం గర్నెపూడిలో డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతినడంతో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. నివాసితులు బకెట్లతో తోడి బయటకు పోసుకున్నారు.
క్రోసూరులో..
మండలంలోని అన్ని గ్రామాల్లో గురువారం సాయంత్రం ఈదురు గాలులతో ఏకధాటిగా వర్షం కురిసింది. పంట పొలాలు, రోడ్లు వర్షం నీటితో నిండిపోయాయి. వారం రోజులుగా ఎండ తీవ్రత, ఉక్కపోతతో ప్రజలు అవస్థలు పడ్డారు. మూగజీవాలు విలవిలలాడాయి. వర్షాల కోసం మండలంలో అనేక గ్రామాల్లో ప్రజలు దేవతలకు జలాభిషేకాలు చేశారు. క్రోసూరు, దొడ్లేరు, నాగవరం, ఊటుకూరు తదితర గ్రామాల ప్రజలు వర్షాల కోసం దేవుళ్లను మొక్కారు. పొంగళ్లు పెట్టుకుని, బొడ్రాయిలకు జలాభిషేకాలు చేశారు. గురువారం కురిసిన వర్షంతో ప్రజలు, రైతులు సంతోషం వ్యక్తం చేశారు.
పెదకూరపాడులో..
వరుణుడి జాడ కోసం ఎదురుచూస్తున్న అన్నదాతల కోరిక ఫలించింది. నియోజకవర్గంలో గురువారం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురియడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలా చోట్ల పత్తి, కూరగాయల విత్తనాలు నాటారు. ఈ సమయంలో భారీ వర్షం కురియడంతో పంటలకు జీవం పోసింది. పలువురు రైతులు విత్తనాలు వేసే పనిలో నిమగ్నమయ్యారు. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పెదకూరపాడులో వాగు పొంగి అమరావతికి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది
పల్నాడును ముంచెత్తిన వాన పలుచోట్ల నీట ముగిన రోడ్లు భారీ వర్షంపై రైతుల హర్షం
రైతులకు మోదం.. ప్రజలకు ఖేదం
రైతులకు మోదం.. ప్రజలకు ఖేదం