
బీసీ నేతలపై అక్రమ కేసులు
పల్నాడులో కూటమి రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు
బీసీల సంక్షేమానికి ఎంతో చేశామంటూ ప్రగల్భాలు పలికే చంద్రబాబు ప్రభుత్వం ఓ బీసీ నేత రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకపోతోంది. ఆ నేతపై కక్ష కట్టింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది కేసులు నమోదు చేసింది. 200 రోజులు కటకటాలపాల్జేసింది. చివరకు అతనిని పదవీ నుంచి దించేసింది. పల్నాడు జిల్లాలో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ బీసీ నేతలను అణగదొక్కుతుంది.
సాక్షి, నరసరావుపేట: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్సార్ సీపీ నేతలను రెడ్‌బుక్ అమలు పేరిట అక్రమ కేసులతో వేధిస్తోంది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో రాజకీయంగా ఎదిగిన బడుగుబలహీన వర్గాల నేతలే టార్గెట్‌గా ఈ వేధింపులు సాగుతున్నాయి. పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపల్ చైర్మన్‌గా పనిచేసిన తురకా కిషోర్‌పై కూటమి ప్రభుత్వం కక్షకట్టింది. ఎనిమిది అక్రమ కేసులు బనాయించి సుమారు 200 రోజులపాటు జైలు పాలు చేసింది. కనీసం మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి కూడా వెళ్లనీయకుండా జైలుకు పంపారు. జైలునుంచి బయటకు రాకుండా కేసుల మీద కేసులు పెట్టి మున్సిపల్ చైర్మన్ పదవి నుంచి తొలగించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు, లోకేష్, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మరెడ్డిలు కిషోర్‌ను టార్గెట్ చేశారు. ఎన్నికల పోలింగ్ తర్వాత కారంపూడిలో జరిగిన గొడవలో కిషోర్‌పై అక్రమ కేసు బనాయించారు. ఎన్నికల సమయంలో రెంటచింతల మండలం పాలువాయి గేటు ఘటనలో కూడా కిషోర్‌పై కేసు నమోదు చేశారు. కిషోర్ కుటుంబంతో సహా మాచర్ల నుంచి దూరంగా వెళ్లిపోయారు. అప్పటికీ టీడీపీ నేతలు ఆ కుటుంబాన్ని వదల్లేదు. మాచర్లలో ఉన్న కిషోర్ ఇంటిపై దాడులు చేసి ఇంట్లో సామాన్లను పగలగొట్టి వీరంగం సృష్టించారు. పోలీసులు కిషోర్ కోసం ఆరు స్పెషల్ టీంలను ఏర్పాటుచేసి అక్రమ కేసుల్లో అరెస్ట్ చేశారు. కుటుంబ సభ్యులను సైతం ఇబ్బందిపెట్టాలన్న ఉద్దేశంతో కిషోర్‌తోపాటు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న సోదరుడు శ్రీకాంత్, జర్నలిస్టుగా పనిచేస్తున్న మరో సోదరుడు పట్టాభిపైనా కేసులు నమోదు చేశారు. శ్రీకాంత్, కిషోర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
పీడీ యాక్టు పెట్టి పదవి నుంచి
తొలగింపు
ఒక కేసులో కిషోర్‌కు బెయిల్ వస్తుందన్న నేపథ్యంలో వెంటనే పోలీసులు అలర్ట్ అయి మరో కేసు బనాయిస్తున్నారు. ఇలా కిషోర్‌తోపాటు రాజకీయాలతో ఏమాత్రం సంబంధంలేని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ శ్రీకాంత్‌పైనా మూడు అక్రమ కేసులు బనాయించారు. అక్రమ కేసులపై న్యాయపోరాటం చేస్తూ ఒక కేసులో బెయిల్ రావడం ఆలస్యం మరో కేసును బనాయించి జైలు నుంచి బయటకు రానివ్వకుండా పీటీ వారంట్లు వేస్తూ పథకం ప్రకారం ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఎప్పుడో 2022లో నాగార్జునసాగర్‌లో ఒక ఘటన జరిగితే ఆ ఘటనలో కిషోర్ పాత్ర ఉందంటూ అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అంతటితో ఆగక మరింత కక్షతో చివరకు కిషోర్‌పై ప్రభుత్వం పీడీయాక్ట్ నమోదు చేసింది. దీంతో నెల్లూరు జైలులో రిమాండ్‌లో ఉన్న కిషోర్‌ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించారు. పీడీయాక్ట్‌పై అడ్వయిజరీ కమిటీ పూర్తిస్థాయిలో విచారించింది. కిషోర్‌పై పీడీ యాక్ట్ పెట్టడం సరికాదని తేల్చిచెప్పింది. దీంతో పీడీ యాక్ట్ ఎత్తివేశారు. ఇదే నేపథ్యంలో ప్రభుత్వం మాచర్ల మున్సిపల్ చైర్మన్ పదవినుంచి కిషోర్‌ను తొలగిస్తూ జీఓ జారీ చేసింది.
మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ తురకా కిషోర్‌పై కొనసాగుతున్న వేధింపులు 8 కేసులు నమోదు చేసి 200 రోజులు జైలులో ఉంచిన కూటమి ప్రభుత్వం పీడీ యాక్ట్ అమలు చేసి కౌన్సిల్ సమావేశానికి రానీయకుండా అడ్డుకున్న ప్రభుత్వం చైర్మన్ పదవి నుంచి తొలగింపు అడ్వయిజరీ కమిటీ పీడీ యాక్ట్ ఎత్తివేయడంతో పాత కేసులు నమోదు బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న కిషోర్ సోదరుడిపైనా అక్రమ కేసులు ఓర్వలేకనే కేసులు అంటున్న బీసీ సంఘాల నేతలు
రూ.10 వేలు దొంగతనం చేశాడంటూ తిరిగి జైలుకు...
ఓ బీసీ యువకుడిని పదవి నుంచి తొలగించేందుకు ఏకంగా చట్టవిరుద్దంగా పీడీ యాక్టును సైతం అమలు చేసి కక్ష తీర్చుకున్నారు. అంతటితో ఆగని ప్రభుత్వం పీడీయాక్ట్ ఎత్తి వేయగానే జైలు నుంచి బయటకు వచ్చే క్రమంలో మళ్లీ వెంటనే 2023లో ఓ స్థలాన్ని కిషోర్ కబ్జా చేయబోయాడంటూ మరో అక్రమ కేసు బనాయించారు. ఈ కేసుకు సంబంధించి పీటీ వారెంట్ దాఖలు చేసిన పోలీసులు జైలునుంచి విడుదలవడానికి సిద్ధంగా ఉన్న కిషోర్‌ను మాచర్ల కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసులో కోర్టు రిమాండ్ విధించి గుంటూరు జిల్లా జైలుకు పంపించింది. ఇలా కేసుల మీద కేసులు పెడుతూ బయటకు రానివ్వకుండా కిషోర్‌పై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుంది. 2023 జరిగిన ఘటన కేసులో హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తుందేమోనన్న అక్కసుతో ఈనెల 13వ తేదీన వెల్దుర్తి పోలీసుస్టేషన్‌లో 2022 జరిగిన పాత సంఘటనపై మరో కేసు నమోదు చేయించారు. ఇందులో ఏకంగా అప్పటి మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ తనను పార్టీ మారమని బెదిరించి ఇంట్లోని బీరువాను పగలగొట్టి రూ.10 వేలు దొంగతనం చేశాడని వెల్దుర్తి మండలం లోయపల్లికి చెందిన టీడీపీ కార్యకర్త దారపునేని శ్రీనివాసరావు చేత ఫిర్యాదు చేయించారు. ఇందులో మాచర్ల కోర్టు రిమాండ్ విధించింది. వడ్డెర సామాజిక వర్గానికి చెందిన తురకా కిషోర్ రాజకీయంగా ఎదగడం ఓర్వలేక కూటమి ప్రభుత్వం, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డిలు కక్షకట్టి వేధిస్తున్నారని బీసీ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా బీసీలపై అక్రమ కేసులు మానుకోవాలని హెచ్చరిస్తున్నారు.

బీసీ నేతలపై అక్రమ కేసులు