
సిటిజన్ సర్వీస్ డెలివరీ అవార్డుకు నరసింహారావు ఎంపిక
యడ్లపాడు: ప్రజలకు ప్రభుత్వ సేవలను సకాలంలో, సమర్థంగా అందించినందుకు గానూ కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది అందజేసే ప్రతిష్టాత్మక సిటిజన్ సర్వీస్ డెలివరీ అవార్డ్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇద్దరు ఎంపికయ్యారు. ఇందులో శ్రీకాకుళం జిల్లావాసి ఒకరు కాగా, పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం బోయపాలేనికి చెందిన వడ్డేపల్లి నరసింహారావు మరొకరు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సాంకేతికతను చేరవేస్తూ, ప్రభుత్వ పథకాలను వారికి తక్కువ సమయంలో అందుబాటులోకి తేవడంలో నరసింహారావు కీలక పాత్ర వహించారు. బోయపాలెంలో కామన్ సర్వీస్ సెంటర్ (సీఎస్‌సీ)ను నెలకొల్పి, నిరంతరంగా సేవలందిస్తూ గ్రామస్తుల విశ్వాసాన్ని గెలుచుకున్నారు. ఆధార్ సేవలు, పింఛన్ నమోదులు, బ్యాంకింగ్ సేవలు, విద్యా సేవలు.. ఇలా అనేక రంగాల్లో ప్రజలకు సేవలందించారు. ఈనెల 16న న్యూఢిల్లీలో జరుగనున్న 16వ సీఎస్‌సీ దివస్ వేడుకలలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రైల్వే మంత్రి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఎంపికై న 28 మందికి సత్కారం జరుగనుంది. వారికి విమాన టికెట్లు, వసతి, ఇతర ఏర్పాట్లు ఇప్పటికే చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం నరసింహారావు వంకాయలపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా సేవలందిస్తున్నారు.