
ప్రభుత్వ వైఫల్యాలపై సమరభేరి
గురజాల: సూపర్ సిక్స్ పథకాలతో పాటు 143 వాగ్దానాలు ఇచ్చి, వాటి అమలులో ఘోరంగా విఫలమైన ప్రభుత్వంపై సమర భేరి మోగిద్దామని వైఎస్సార్ సీపీ గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం పిలుపునిచ్చారు. గురజాలలో సోమవారం పార్టీ కార్యాలయంలో ‘బాబు ష్యూరిటీ– మోసం గ్యారంటీ’ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే కాసు మాట్లాడుతూ మోసపూరితమైన హామీలు ఇచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ధ్వజమెత్తారు. తీరా గద్దె ఎక్కాక వాటిని నెరవేర్చకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. మొదటి నుంచి చంద్రబాబుకు మోసం చేసే అలవాటుందని తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను గ్రామాల్లోకి తీసుకువచ్చి పాలన సౌలభ్యం అందించిందని వివరించారు. సంపద సృష్టిస్తామని చెప్పి చంద్రబాబు దాన్ని వృథా చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రూ.1,63,000 కోట్లు అప్పు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని విమర్శించారు. ఇన్ని అప్పులు చేసినా ప్రజలకు మాత్రం ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయలేదని తెలిపారు. పేదల పక్షాన ఉన్న నాయకుడు జగన్ అయితే, పేదలను వంచించే నాయకుడు చంద్రబాబు అని విమర్శించారు. వైఎస్సార్ సీపీ హయాంలో జరిగిన అభివృద్ధికి కూటమి నాయకులు కొబ్బరి కాయలు కొట్టి మళ్లీ ప్రారంభిస్తున్నారని తెలిపారు. మెడికల్ కళాశాల, జానపాడు రైల్వే బ్రిడ్జి , సిమెంటు కర్మాగారం మూసి వేశారని, సెల్ఫీల ద్వారా పోరాటం చేస్తే వెంటనే పనులు ప్రారంభించారని మహేశ్‌రెడ్డి గుర్తు చేశారు.
ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో అలజడులు
మాజీ ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో సైతం కూటమి నాయకులు అలజడులు సృష్టించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. జగన్ మోహన్‌రెడ్డి తమలో ధైర్యం నింపారని, కార్యకర్తల్లో నింపేందుకు వచ్చామని చెప్పారు. ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండి ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
సర్కారు మోసాలను ఎండగడదాం
వైఎస్సార్ సీపీ నాయకుల పిలుపు
గురజాలలో ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ’ సభకు స్పందన
వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో జోష్
కలసికట్టుగా ఉండాలి
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి యెనుముల మురళీధర్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కొమ్మినేని వెంకటేశ్వర్లు (కేవీ) మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ నాయకులంతా కలసికట్టుగా ఉంటూ పోరాటం చేస్తే విజయం సాధించవచ్చని తెలిపారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని, చంద్రబాబునాయుడుది మోసం చేసే నైజమని ధ్వజమెత్తారు. గ్రామ స్థాయి నుంచి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు.ప్రతి ఒక్కరూ భయపడకుండా గ్రామాల్లో ముందుకు పోవాలని తెలిపారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా నిచ్చారు. గ్రామాల్లో రచ్చబండలను ఏర్పాటుచేసి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. వైఎస్సార్ సీపీ చేసిన అభివృద్ధి, కూటమి నేతలు చేసిన అభివృద్ధిని వివరించాలని తెలిపారు. గ్రామ స్థాయి నుంచే పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ కొమ్మినేని బుజ్జి, పట్టణ కన్వీనర్ కె. అన్నారావు, వేముల చలమయ్య, మాజీ మండల కన్వీనర్ సిద్ధాద్దాడపు గాంధీ, కలకండ ఆంద్రెయ్య, కర్రా చినకోటేశ్వరరావు, యశోద దుర్గా, మన్నెం ప్రసాద్, కొమ్మినేని రవిశంకర్, షేక్ నాగులుమీరా, వలి, పీర్ అహ్మద్ పాల్గొన్నారు.

ప్రభుత్వ వైఫల్యాలపై సమరభేరి