
నకిలీ బంగారం అంటగట్టి మోసం
నరసరావుపేట: మేలిమి బంగారం చూపించి రూ.15లక్షలు తీసుకొని ఆ తర్వాత నకిలీది అంటకట్టి అజ్ఞాత వ్యక్తి మోసం చేశాడంటూ ఓ మహిళ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఎస్పీ కంచి శ్రీనివాసరావు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు అధ్యక్షత వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి 75 ఫిర్యాదులు స్వీకరించారు. వీటిల్లో మోసాలు, కుటుంబ, ఆర్థిక, ఆస్తి తగాదాలు సమస్యలు ఉన్నాయి. వాటిలో కొన్ని ...
మోసపోయాం
నా భర్త మృతిచెందగా అతని పేరుపై ఉన్న ఫోన్ నంబరు వాడుతున్నా. దానిని ఒక అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి తన వద్ద బంగారం ఉందని, పరీక్ష చేయించుకునేందుకు రెండు కాయిన్స్ ఇస్తానని ఫోన్‌లో చెప్పాడు. ఆ విషయం నా చెల్లెలి భర్తతో మాట్లాడించగా, బళ్లారి రమ్మని కోరాడు. రెండు కాయిన్స్ తెచ్చుకొని నేను, నా చెల్లెలు భర్త హైదరాబాదులో పరీక్ష చేయించాం. అది మేలిమి బంగారమని తేలింది. దీంతో ఆ వ్యక్తిపై మాకు నమ్మకం కుదిరింది. ఇద్దరం మళ్లా బళ్లారి వెళ్లి రూ.15లక్షలు చెల్లించి 250 గ్రాముల బంగారాన్ని కొనుగోలు చేశాం. దానిని తీసుకొచ్చి హైదరాబాదులో టెస్ట్ చేయించగా నకిలీ బంగారమని తేలింది. అప్పటి నుంచి ఆ అజ్ఞాత వ్యక్తికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అయింది. మోసం చేసిన వ్యక్తిని పట్టుకొని మా డబ్బులు ఇప్పించండి.
–షేక్ జానీ బేగం, దుర్గి
విడాకులు ఇవ్వకపోతే
చంపుతానంటున్న భర్త
నాకు ఎనిమిదేళ్ల కిందట వివాహమైంది. ప్రస్తుతం గురజాలలో ఏఎన్‌ఎంగా పని చేస్తున్నా. వివాహం జరిగినప్పటి నుంచి పిల్లలు కలగలేదు. దీంతో భర్త వెంకట జనార్దనరావు, అత్తమామలు అనేక సార్లు శారీరకంగా మానసికంగా వేధించారు. నా భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని బిడ్డను కన్నాడు. దీంతో వివాహ సందర్భంగా ఇచ్చిన రూ.10లక్షల కట్నం, బంగారం తిరిగి ఇస్తామని ఒప్పకోవడంతో అత్తగారింటికి వెళ్లా. అయినప్పటికీ ఆ డబ్బులు, బంగారం ఇవ్వకుండా సామాన్లు బయటకు వేశారు. దీంతో పాటు నేను ఉద్యోగం చేసుకుంటున్న చోటుకు వచ్చి విడాకులు ఇవ్వకపోతే చంపుతానని బెదిరిస్తున్నాడు. అతడిపై చర్యలు తీసుకోండి.
– ఏఎన్‌ఎం, గురజాల
జిల్లా ఎస్పీకి దుర్గి మహిళ ఫిర్యాదు పీజీఆర్‌ఎస్‌లో ప్రజల నుంచి 75 ఫిర్యాదులు